Let's talk: editor@tmv.in
వరద బాధితులకు భరోసానిచ్చిన డిప్యూటీ సీఎం

వరద బాధితులకు భరోసానిచ్చిన డిప్యూటీ సీఎం

Pinjari Chand
1 అక్టోబర్, 2025

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన మరాఠ్వాడ, రాష్ట్రంలోని ఇతర రైతులను, ప్రజలను ఆదుకుంటామని డిప్యూటీ సీఎం, శివసేన అధ్యక్షుడు షిండే హమీ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో చాలా ప్రాంతాలు వర్షాలకు, వరదలకు ముంపునకు గురయ్యాయని, ఇప్పటికి చాలా మంది ప్రజల ఇళ్​లు, పంటలు నీటిలోనే మునిగి ఉన్నాయని ఆవేదన చెందారు. వరదల వలన రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. గతంలో చేసినట్లుగానే ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. ఈ అంశంపై మంత్రి వర్గ ఉపసంఘం చర్చించింది. ఈ సంక్షోభ సమయంలో రైతులకు ప్రభుత్వం సహాయం చేస్తూనే ఉంటుందన్నారు. దాదాపు 60 లక్షల హెక్టార్లపై గా పంటలు దెబ్బతిన్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో దెబ్బతిన్న పంటల వివరాల సేకరణ పూర్తవుతుంది. దాని తరువాత వారికి పరిహారం అందజేస్తామన్నారు. కేబినేట్​ సమావేశంలో ఎటువంటి నిబంధనలు, షరతులు లేకుండా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నిర్ణయించాం. ఇటువంటి సంక్షోభ సమయంలో రైతులకు సహాయం చేయడం ప్రభుత్వ బాధ్యత. రాబోయే రోజుల్లో మేము(సీఎం ఫడ్నవీస్​, డిప్యూటీ సీఎం అజిత్​ దాదా)తో కలిసి రైతుల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రధాని మంత్రికి వివరించాం

మహారాష్ట్రలో వచ్చిన వరదల గురించి దేశ ప్రధాని నరేంద్రమోడీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షాకు నివేదికలు సమర్పించాం. కేంద్రం గతంలో కూడా రైతులకు మద్దతుగా నిలిచింది. ఈసారి కూడా అదేవిధంగా స్పందిస్తుందని ఆశిస్తున్నా మన్నారు. అలాగే వరదల వలన పంటలు, ఇళ్లకు, పాడి సంపద, ప్రాణ నష్టం జరిగిందని వాపోయారు. అయితే ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం సాయం చేయడానికి వెనుకాడదని షిండే తెలిపారు. నిరాశ్రయులైన వరద బాధితులకు నిత్యావసరాలు అందించడంలో మహాయుతి ప్రభుత్వం చేస్తున్న కృషిని మీడియా ప్రతి నిధులకు వివరించారు. అలాగే ప్రజలను ఆదుకోవడంలో ప్రతిపక్షాలు, ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వంతో కలిసి రావాలని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. బియ్యం, గోధుమలు, మొదలైన నిత్యావసర వస్తువులను అందించడంతో బాటు రూ.10,000 నగదును అందిస్తున్నామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహయక చర్యలు చేపట్టాలి. అక్కడ ఎటువంటి అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రోగాలు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంటుందన్నారు.

వరద బాధితులకు సహయం చేయండి

ప్రస్తుతం దసరా పండుగ సందర్భంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ మినహ, వివిధ ప్రాంతాలలోని శివసేన కార్యకర్తలు ముంబైకి రాకుండా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు సహాయం చేయాలని షిండే పార్టీ కార్యకర్తలను, నాయకులను ఆదేశించారు. మా పార్టీ నాయకులు ఎల్లప్పుడూ 80 శాతం మంది సామాజిక సేవలో, 20 శాతం రాజకీయాల్లో ఉంటారని తెలిపారు. అలాగే సామాజిక సేవ చేయడానికి ఇది సరైన సమయమని కార్యకర్తలకు సూచించారు.

సామగ్రి పై వివాదం

వరద బాధితులకు అందిస్తున్నసహాయ సామగ్రిపై షిండే ఫోటో ఉండడంతో రాజకీయ వివాదం చెలరేగింది. ప్రతిపక్షాలు డిప్యూటీ సీఎం పై విమర్శలు గుప్పించాయి. దీనిపై ఆయన స్పందిస్తూ ప్రతిపక్షాలు కేవలం ఫోటోనే చూశాయి. సామగ్రిని కాదు. పార్టీలోని నాయకులు,కార్యకర్తలు ఫోటోలను అతికిస్తారు. ఫోటోలు పెట్టారని విమర్శించే వారిని నేను ఒకటే అడుగుతున్నా.. గతంలో మీరు పంపీణి చేసిన సహయ సామగ్రిపై కూడా ఫోటోలు ఉన్నాయని గుర్తు చేశారు.

వరద బాధితులకు భరోసానిచ్చిన డిప్యూటీ సీఎం - Tholi Paluku