Let's talk: editor@tmv.in
వరద ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ పరిశీలన

వరద ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ పరిశీలన

Gaddamidi Naveen
28 సెప్టెంబర్, 2025

హైదరాబాద్‌ నగరంలోని మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాల కారణంగా ఏర్పడిన వరద పరిస్థితిని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆయన చాదర్ ఘాట్, మూసారంబాగ్, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి ప‌రిస్థ‌తుల‌ను సమీక్షించారు. చాదర్ ఘాట్ ప్రాంతంలో మూసీ నది ముంచెత్తిన నివాస ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చేపట్టిన సహాయక చర్యలను కమిషనర్ పరిశీలించారు. అలాగే, నీట మునిగిన ప్రాంతాల్లో భవనాలపై చిక్కుకున్న ప్రజలకు డ్రోన్ల ద్వారా ఆహారం, అంద‌జేశామ‌ని తెలిపారు.

ఎంజీబీ ఎస్ వ‌ద్ద మూసీ న‌ది రిట్తెనింగ్ వాల్ ప‌డిపోవ‌డంతో వ‌ర‌ద లోప‌ల‌కి ప్రవేశించిన ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్, భద్రతా చర్యలు మరింతగా పటిష్టం చేయాలని ఆదేశించారు. దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా హైడ్రా డీఆర్ఫ్ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే శుక్రవారం అర్ధరాత్రి ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు ప్రవేశించిన వేళ, వందలాది ప్రయాణికులను జీహెచ్ఎంసీ, డీఆర్ ఎఫ్,ఆర్టీసి , పోలీసు సిబ్బంది సమన్వయంతో సురక్షితంగా బయటకు తీసుకెళ్లడాన్ని కమిషనర్ అభినందించారు. వరదల దృష్ట్యా మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. వర్షాలు తగ్గినపటికీ హైడ్రా డీఆర్ ఎఫ్, ఎన్ డీఆర్ఎఫ్, ఎస్ డీఆర్ఎఫ్, బృందాలు అప్రమత్తంగా ఉండి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నాయ‌ని హైడ్రా కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు నదికి సమీపంగా నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, సహాయక బృందాలకు సహకరించాలని సూచించారు.

వరద ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ పరిశీలన - Tholi Paluku