Let's talk: editor@tmv.in
వరదనీటిని వాటాగా లెక్కేస్తే నష్టపోతాం - మంత్రి గొట్టిపాటి రవికుమార్

వరదనీటిని వాటాగా లెక్కేస్తే నష్టపోతాం - మంత్రి గొట్టిపాటి రవికుమార్

Dantu Vijaya Lakshmi Prasanna
25 డిసెంబర్, 2025

వరదల సమయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి వదిలిన నీటిని సైతం కృష్ణా జలాల్లో వినియోగించుకున్న నీటిగా లెక్కించడం వల్ల రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నీటిని కోల్పోవాల్సి వస్తోందని జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభిప్రాయపడ్డారు.

ఇటీవల స్థానిక కలెక్టరేట్ ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, వరదనీరు అనేది అనియంత్రితంగా, అకస్మాత్తుగా వచ్చి ఎక్కువగా సముద్రంలో కలిసిపోయే నీరు కావడంతో దానిని శాశ్వతంగా లభించే నీటి వాటాగా లెక్కిస్తే కాగితాల్లో మాత్రమే నీరు ఉన్నట్టవుతుంది. కానీ వాస్తవంగా రైతులకు, తాగునీటి అవసరాలకు అందదు. ఇలా లెక్కించడం వల్ల నిజమైన హక్కు నీరు తగ్గిపోతుంది, దిగువ ప్రాంతాలు నష్టపోతాయి, భవిష్యత్తులో అవసరమైన ప్రాజెక్టులు నిర్మించే అవకాశం కూడా దెబ్బతింటుంది, అందుకే వరదనీటిని వాటాగా పరిగణించడం ప్రమాదకరమన్నారు. వరదనీటిని వాటాలో చేరిస్తే, కొత్త ప్రాజెక్టులు కట్టేందుకు అవకాశం తగ్గుతుంది. “నీటి అవసరం లేదు, వాటా ఉందిగా” అని తిరస్కరిస్తారు. దీర్ఘకాలంలో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు. అలాగే సాగునీటిపై రైతుల నుంచి పన్నులు వసూలు చేసి కాల్వల నిర్వహణ మెరుగుపరచాలన్నారు. ఎత్తిపోతల పథకాలు మెరుగ్గా నిర్వహించేందుకు మొబైల్ లిఫ్ట్ పరికరాలు, నూతన ట్రాన్స్ ఫార్మర్లపై ప్రతిపాదనలు పంపాలన్నారు.

జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ, కాల్వల్లో సీపేజీ ద్వారా నీరు నష్టపోకుండా నివారించేందుకు డిజాస్టర్ మేనేజ్ మెంట్ నిధులు వినియోగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రూ.60 లక్షల వరకూ డిజాస్టర్ మేనేజ్ మెంట్ నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని తెలిపారు.