
'వరకట్న వేధింపుల' కారణంగా ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య
గుంటూరు జిల్లా తాడేపల్లి నవోదయ కాలనీలో ఓ ఐఏఎస్ కుమార్తె మాధురి వరకట్న వేధింపులు తాళలేక ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ సెక్రెటరీ ఎస్. చిన్న రాముడు ఐఏఎస్ కుమార్తె. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో ఎస్సీ కమిషన్ ఆఫీసులో పని చేసే చినరాయుడు ఇటీవలే ఎస్సీ మిషన్ సెక్రటరీగా వచ్చారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేశారు.
"ఐఏఎస్ అధికారి కుమార్తె అయిన మాధురి సాహితిబాయి (25) గతంలో వరకట్న వేధింపుల ఆరోపణలు చేసిన తర్వాత ఆదివారం తన తల్లిదండ్రుల ఇంట్లో చనిపోయి కనిపించింది," అని మంగళగిరి డీఎస్పీ మురళి కృష్ణ తెలిపారు.
వరకట్న వేధింపుల ఆరోపణలు చేసిన కొద్ది నెలలకే గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో తన తల్లిదండ్రుల ఇంట్లో ఈ ఘటన జరిగింది. మంగళవారం చాలా సేపు ఆమె బాత్రూమ్ నుండి బయటకు రాకపోవడంతో, ఆమె తల్లిదండ్రులు తలుపులు పగులగొట్టి చూడగా, ఆమె ఉరివేసుకుని కనిపించిందని పోలీసులు తెలిపారు. బీఎన్ఎస్ సెక్షన్ 80 (వరకట్న మరణాలకు సంబంధించినది) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం, సాహితిబాయి నంద్యాల జిల్లా, బేతంచర్ల మండలంలోని ఆమె గ్రామం బుగ్గనపల్లెకు చెందిన రాజేష్ నాయుడును ప్రేమించింది. గతంలో బ్యాక్ లాగ్స్ కారణంగా తన బి.టెక్ కోర్సును నిలిపివేసింది. ఆమె ఎనిమిది నెలల కిందట రాజేష్ ను కులాంతర వివాహం చేసుకుంది. మార్చి 5న వివాహం జరగగా మార్చి 7 న తన తల్లిదండ్రులకు, భర్త కుటుంబానికి తెలియజేసింది. తరువాత వివాహం అధికారికంగా నమోదు చేయబడింది. అయితే, కొన్ని నెలల క్రితం, వరకట్న వేధింపులు ఎదుర్కొంటున్నట్లు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం, దీని తరువాత ఆమె తల్లిదండ్రులు సెప్టెంబర్ మొదటి వారంలో ఆమెను తమ ఇంటికి తిరిగి తీసుకువచ్చారని తెలిపారు. తమతో తిరిగి రావడానికి ఆమె అంగీకరించిందని, అప్పటి నుండి వారి నివాసంలోనే ఉంటోందని ఆమె తల్లిదండ్రులు చెప్పినట్లు తెలిపారు.
ఇటీవల భర్త వేధింపులు ఎక్కువ కావడంతో మాధురి నిన్న ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయిందని, మానసికంగా వేధించడం వల్లే తమ కుమార్తె మరణించిందని మాధురి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి డిఎస్పి మురళీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
