
వరంగల్ వేయి స్తంభాలగుడి ప్రాశస్త్యం...
హన్మకొండ నగరం మధ్యలో, రాతలలో చరిత్రను, శిల్పాలలో సంస్కృతిని ప్రతి బింబించే ఒక అద్భుతం వెయ్యి స్తంభాల గుడి. 800 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయం ఓ ఆధ్యాత్మిక శిఖరం, శిల్పకళా నైపుణ్యం శాస్త్రీయ నిర్మా ణ వైభవాలను కలగలిపి ఒకేవేదికపై ఆవిష్కరిస్తుందా అన్నట్లు వుంటుంది దీని చారిత్రక వైభవం.
వేయి స్తంభాల ఆలయం లేదా రుద్రేశ్వర స్వామి ఆలయం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ నగరంలో ఉన్న ఒక చారిత్రాత్మక హిందూ ఆలయం. ఇది శివుడు, విష్ణువు, సూర్యుడికి అంకితం చేయబడింది. వేయి స్తంభాల ఆలయం, వరంగల్ కోట, కాకతీయ కళా తోరణం, రామప్ప దేవాలయం యునెస్కో వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడ్డాయి
చరిత్రలో దీని ప్రాభవం:
కాకతీయ పాలకులు గణపతి దేవుడు, రుద్రమ దేవి ప్రతాపరుద్రుల పోషణలో అనేక హిందూ దేవాలయాలు అభివృద్ధి చేయబడ్డాయి . వేయి స్తంభాల ఆలయం క్రీ . శ 1175, 1324 మధ్య కాకతీయ రాజు రుద్రదేవుని ఆదేశం మేరకు నిర్మించబడిందని చెబుతారు. ప్రధాన ఆలయంలో శివలింగం ఉంటుంది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు.
కొందరు చరిత్రకారులు 1163 సంవత్సరంలో కాకతీయ రాజు ప్రతాప రుద్రదేవుడు దీన్ని నిర్మించారు అంటారు. ఈ ఆలయం కాకతీయుల శక్తి, సంపద, సంస్కృతి ఉజ్జ్వల స్థితిలో ఉన్న కాలానికి నిదర్శనం. అప్పటిదేవాలయ నిర్మాణాలు కేవలం పూజాస్థలాలుగానే కాకుండా, రాజవంశ ఘనతకు ప్రతీకలుగా నిలిచేవి.
తుగ్లక్ రాజవంశం దక్కన్ పై దండయాత్ర చేసినప్పుడు దీనిని కొంత శిధిలం చేసింది. అయితే, తరువాతి కాలంలో హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ ఆలయ పునర్నిర్మాణానికి అప్పట్లో 1 లక్ష రూపాయల గ్రాంట్‌ను విరాళంగా ఇచ్చాడు
పేరుకే వెయ్యి స్తంభాలు
ఈ ఆలయంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి అంటారు. . ఆలయంలో భాగాలుగా గొప్పగా చెక్కబడిన స్తంభాలు, చిల్లులు గల తెరలు, అద్భుతమైన చిహ్నాలు, రాతితో చేసిన ఏనుగులు ఏకశిలపై చెక్కబడిన నంది ఉన్నాయి . శాండ్‌బాక్స్ టెక్నిక్ వంటివి వాడి ఆలయ పునాదులను బలోపేతం చేశారు. వారి కళలో చమత్కారమైన హస్తకళ, దోషరహిత దంతపు చెక్కడం, సాంకేతికత, శిల్పుల నైపుణ్యం వ్యక్తమవుతుంది. అంతేకాక కాకతీయ శిల్పుల చాతుర్యం డోలరైట్, గ్రానైట్ రాతి శిల్పం, నవ రంగమండప చేతిపనిలో మెరిసే పాలిష్ వంటి వాటిలో కనిపిస్తుంది.
వెయ్యి స్తంభాల గుడి అని పిలవబడుతున్నా , ఇందులో నిజంగా వెయ్యి స్తంభాలు లేవు. కానీ, ఇక్కడున్న ప్రతీ శిల్పస్తంభం ఒక దాని కొకటి పోటీపడుతూ ప్రత్యేక రూపకల్పనతో, అందంతో ఒక అనంత శిల్ప ప్రాంగణం భావనను కలిగిస్తాయి. మదనికల రూపురేఖలు సజీవంగా ఉన్నాయా అన్న భ్రమను కలిగిస్తాయి.
నిర్మాణ వైశిష్ట్యం
ఈ ఆలయం త్రికూటాలయ శైలిలో నిర్మించబడింది. అంటే, మూడు గర్భగృహాలు శివుడు (రుద్రేశ్వరుడు), విష్ణువు,సూర్యుడు విగ్రహాలు ప్రత్యేకంగా ఒకేప్రాంగణంలో కలిపి నిర్మించబడ్డాయి. నక్షత్రాకారపు వేదికపై నిలిచిన ఈ ఆలయం, నాజూకైన రాతి పని, దృఢమైన నిర్మా ణం కలగలిపిన ఒక అద్భుతం.
శిల్పాలు:
ఇక్కడ స్తంబాలపై రామాయణం, మహాభారతం, పురాణ కథలు, నృత్య భంగిమలు, పుష్పాలంకారాలు, యక్ష కిన్నెర మూర్తులు చెక్కబడ్డాయి.
నంది విగ్రహం:
ఒకే రాయితో( ఏకశిల) చెక్కిన భారీ నంది, శివ గర్భగృహానికి ఎదురుగా నిలుస్తుంది. ఇందువల్లనే ఈ నగరానికి ఏకశిలానగరమని పేరు. తెలుగు పూర్వ రూపమైన ద్రావిడ భాషలో ఓరు(ఒక), గల్లు(రాయి,శిల) ల మీదుగా ఈ నగరానికి ఓరుగల్లు, వరంగల్ అనే పేర్లు వచ్చాయి.
స్తంభాలు:
సున్నితమైన పొలిష్‌తో, వెలుతురు నీడల ఆటతో మెరుస్తున్న ప్రతి స్తంభం ప్రత్యేక ఆకర్షణ.
సాంస్కృతిక ప్రాముఖ్యత
వెయ్యి స్తంభాల గుడికేవలం పూజా స్థలం కాదు, కాకతీయుల శిల్పకళా ప్రావీణ్యాన్ని , శాస్త్రీయ జ్ఞాన సంపదను, ఆధ్యాత్మికత ను కలగలుపుకున్న శాశ్వత చిహ్నం. ఇక్కడి శిల్పాలు, నిర్మాణ శైలి తర్వాతి శతాబ్దాల్లో దక్షిణ భారత ఆలయ నిర్మాణాలకు ప్రేరణనిచ్చాయి.
ప్రస్తుత స్థితి
మధ్యయుగంలో జరిగిన దండయాత్రల కారణంగా దెబ్బతిన్న ఈ ఆలయాన్ని , ఇటీవల భారత పురావస్తు శాఖ సంరక్షణలో పునరుద్ధరించారు. ప్రస్తుతం ఇది సంరక్షిత స్మారక చిహ్నంగా, వరంగల్ పర్యాటక పటంలో ప్రధాన స్థానంలో నిలుస్తుంది.
వెళ్ళడానికి సరైన సమయం
అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు వాతావరణం చల్లగా ఉంటుంది. ఉదయం వేళల్లో ప్రశాంత దర్శనం, సాయంత్రం సూర్య కాంతిలో శిల్పాల అందం ప్రత్యేకంగా మెరిసిపోతాయి.
ప్రయాణ సౌకర్యాలు
హన్మకొండ, హైదరాబాద్ నుంచి 150 కి.మీ ఉంటుంది.
రోడ్డు మార్గం:
జాతీయ రహదారి 163 ద్వారా బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉన్నాయి.
రైలు మార్గం:
వరంగల్, కాజీపేట్ జంక్షన్ సమీప రైల్వే స్టేషన్లు.
సౌకర్యాలు:
గైడ్లు, పర్యాటక సమాచారం బోర్డులు, సమీపంలో భోజన వసతి సదుపాయాలు. వున్నాయి.
దగ్గర్లోని ఆకర్షణలు
వెయ్యి స్తంభాల గుడిసందర్శనను వరంగల్ కోట, భద్రకాళి ఆలయం, రామప్ప గుడి, పాకాల చెరువు యాత్ర తో కలిపి ప్లాన్ చేస్తే పూర్తివారసత్వ పర్యటన అవుతుంది. వెయ్యి స్తంభాల గుడికేవలం నల్లరాళ్లనిర్మాణం కాదు. మన మనసులో వేయి వేణునాదాలు ఒకేసారి వినిపించే ఆలయం
