
వరంగల్ మార్కెట్‌లో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
వరంగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో భారత పత్తి సంస్థ (సి.సి.ఐ - కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్నిమంత్రి కొండా సురేఖ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక అధికారులు పాల్గొన్నారు. రైతులు తమ పత్తి పంటకు మద్దతు ధర పొందేలా చూడాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తోందని కొండా సురేఖ ఈ సందర్భంగా తెలిపారు.
మద్దతు ధర: క్వింటాల్‌కు రూ. 8,110/-
మంత్రి మాట్టాడుతూ.. రైతులు దళారులు వ్యాపారుల చేతుల్లో నష్టపోకుండా ఉండేందుకు, ప్రభుత్వం సి.సి.ఐ ద్వారా నేరుగా పత్తిని కొనుగోలు చేసే విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తోందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత సీజన్‌కు గాను పత్తి పంటకు క్వింటాల్‌కు రూ. 8,110/- మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నప్పటికీ, రైతులకు ఈ నిర్ణీత మద్దతు ధర లభించేలా సి.సి.ఐ కేంద్రాలు పనిచేస్తాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే రైతులు దళారుల మాయమాటలకు మోసపోకుండా, తమ పత్తిని నేరుగా సి.సి.ఐ కొనుగోలు కేంద్రాలకే విక్రయించాలని సూచించారు. సరైన ధరకు పత్తిని విక్రయించడం ద్వారా ఆర్థికంగా లాభపడాలని కోరారు.
తేమ పేరుతో ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
కొనుగోలు కేంద్రాలలో తేమ శాతం పేరుతో కొందరు సిబ్బంది లేదా వ్యాపారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదులు ఈ విషయంలో వస్తే ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని ఆమె హెచ్చరించారు. రైతులను మోసం చేయడానికి లేదా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించే వారిపై, కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని, రైతులకు సకాలంలో చెల్లింపులు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి కొండా సురేఖ సూచించారు.
