Let's talk: editor@tmv.in
వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలి: కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలి: కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

Gaddamidi Naveen
15 జులై, 2026

తెలంగాణలో నిర్మించనున్న వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పౌర విమానయాన శాఖ కార్యాలయంలో కేంద్రమంత్రితో భేటీ అయి, ఈ రెండు విమానాశ్రయాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు వరంగల్ కేంద్రంగా ఉంటుందని తెలిపారు. రైలు, రోడ్డు మార్గాల అనుసంధానంతో పాటు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వంటి పరిశ్రమలతో ఈ నగరం కీలకంగా మారుతోందని, భవిష్యత్తులో వరంగల్‌ను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. వరంగల్ విమానాశ్రయంలో ఎంఆర్‌వో, ఎయిర్‌కార్గో, హ్యాంగర్ వసతులు కల్పించాలని కోరారు. ఇప్పటికే భూసేకరణ పూర్తయినందున వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని, జూన్ 2, 2028 నాటికి ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేశారు.

వరంగల్‌కు ఉన్న ఘనమైన చరిత్రను ప్రతిబింబిస్తూ, కాకతీయ సంస్కృతికి అద్దం పట్టేలా ఎయిర్‌పోర్ట్ డిజైన్లు ఉండాలని సీఎం కోరగా, కేంద్ర మంత్రి సుముఖత వ్యక్తం చేశారు. అలాగే, ఆదిలాబాద్‌లో రక్షణ శాఖ ఆధ్వర్యంలోని ఎయిర్‌పోర్ట్‌తో పాటు పౌర విమానాశ్రయం (సివిల్ ఎన్‌క్లేవ్) నిర్మించాలని, దానికి అవసరమైన భూమిని సేకరించి ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లోనూ ఎంఆర్‌వో, కార్గో వసతులతో పాటు, రెండు విమానాశ్రయాల్లోనూ విమాన శిక్షణ సంస్థలు నెలకొల్పాలని కోరారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజీకి సీప్లేన్‌లు నడిపే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించగా, దీనిపై తగిన ప్రతిపాదనలు సమర్పించాలని కేంద్ర మంత్రి కోరారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణను అత్యంత వేగంగా పూర్తి చేసి చరిత్ర సృష్టించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్యమంత్రిని అభినందించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేదని, అవి ఎన్నికల వరకే పరిమితమని స్పష్టం చేశారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు, కేంద్ర పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
TelanganaRevanthReddyWarangalAdilabadWarangalAirportAdilabadAirportAirportDevelopmentInfrastructureTelanganaDevelopmentCivilAviation
వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలి: కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి - Tholi Paluku