Let's talk: editor@tmv.in
వరంగల్ అభివృద్ధి కోసం రూ.5 వేల కోట్లు

వరంగల్ అభివృద్ధి కోసం రూ.5 వేల కోట్లు

Gaddamidi Naveen
12 మార్చి, 2026

వరంగల్ నగర అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి కొండా సురేఖతో కలిసి సచివాలయంలో వరంగల్ నగర అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో జరుగుతున్న ముఖ్య ప్రాజెక్టుల పురోగతిని అధికారులు వివరణాత్మకంగా వివరించారు.

సమీక్షలో భాగంగా మంత్రి అధికారులు పనులను వేగవంతం చేసి ముఖ్య ప్రాజెక్టులను జూన్ 2 నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఆ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వాటిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నగర అభివృద్ధికి కీలకమైన పలుప్రాజెక్టులు ప్రస్తుతం అమలు దశలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

ఈ ప్రాజెక్టుల్లో ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం ప్రధానమైనది. దీనితో పాటు రూ.5,257 కోట్ల వ్యయంతో చేపడుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు, భద్రకాళి ఆలయం, భద్రకాళి చెరువు అభివృద్ధి పనులు కూడా కీలకంగా ఉన్నాయి. నగర ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు అంతర్గత, ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

అదేవిధంగా “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్” కోసం భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పేదలకు అందిస్తున్న 2బిహెచ్‌కే గృహాల నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి, తాగునీరు, రోడ్లు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు చెప్పారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, కలెక్టర్లు తదితర ఉన్నతాధికారులు హాజరై అభివృద్ధి పనుల పురోగతిపై వివరాలు వెల్లడించారు. వరంగల్ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. నగరానికి దీర్ఘకాలిక మౌలిక వసతులు కల్పించడం ద్వారా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా చర్యలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.