
వయోవృద్ధుల దర్శనంపై వదంతులు నమ్మొద్దు : టీటీడీ
శ్రీవారి దర్శనాలకు సంబంధించి, ముఖ్యంగా వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనంపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు మరోసారి విజ్ఞప్తి చేసింది. ఈ దర్శనంపై తప్పుదోవ పట్టించేలా ప్రచారమవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. ఈ మేరకు టీటీడీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
అది టీటీడీ రహదారి కాదు
శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జరుగుతున్న మరో దుష్ప్రచారాన్ని కూడా టీటీడీ ఖండించింది. అలిపిరి మెట్ల మార్గం వద్ద మద్యం తాగి సీసాలు పగులగొట్టి భక్తులకు మందుబాబులు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ వస్తున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ స్పష్టం చేసింది. అలిపిరి నుంచి రుయా ఆస్పత్రికి వెళ్లే మార్గంలో కొందరు ఆకతాయిలు పగిలిన గాజు సీసా ముక్కలు రోడ్డుపై విసిరివేశారని టీటీడీ తెలిపింది. వాస్తవానికి ఈ ప్రాంతం టీటీడీ రహదారి కాదని అధికారులు పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు దీనిని అలిపిరి మెట్ల మార్గం వద్ద భక్తులకు ఇబ్బందిగా వక్రీకరిస్తున్నారని మండిపడింది.
చట్టపరమైన చర్యలు
ఇలాంటి అసత్య వార్తలను నమ్మవద్దని కోరిన టీటీడీ, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. భక్తులు అవాస్తవాలను, వదంతులను నమ్మకుండా, కేవలం టీటీడీ అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు కోరారు.
ఆన్ లైన్ కోటాలోనే బుకింగ్
రోజూ వెయ్యి మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీమూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తుంది. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50 లడ్డూ ఉచితంగా ఇస్తుంది. తిరుమల నంబి ఆలయానికి ఆనుకొని ఉన్న సీనియర్ సిటిజన్, పీహెచ్‌సీ లైన్ ద్వారా రోజూ మధ్యాహ్నం 3గంటలకు శ్రీవారి దర్శనానికి వారిని అనుమతిస్తారని టీటీడీ స్పష్టం చేసింది. అందువల్ల సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యే తప్పుడు వార్తలు, వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.
