
విమానాశ్రయాలపై సైబర్ దాడి: అరెస్ట్
యూరోపియన్ దేశాల్లో విమానాశ్రయాలపై జరిగిన సైబర్ దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మూడు రోజుల విచారణ అనంతరం ఓ వ్యక్తిని బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఏ ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడ్డారనే కోణంలో అతడిని ప్రశ్నిస్తున్నారు. అనంతరం సదరు వ్యక్తిని షరతులతో కూడుకున్న బెయిల్‌పై విడుదల చేశారు. విమానాశ్రయాల్లో చెక్ ఇన్, బోర్డింగ్ సేవలు అందించే కాలిన్స్ ఏరోస్పేస్ కంపెనీపై ఈ సైబర్ దాడి జరిగింది. యూరప్‌లోని పెద్ద విమానాశ్రయాల్లో భారీ గందరగోళాన్ని సృష్టించింది. దాదాపు మూడు రోజుల విచారణ అనంతరం ఈ కేసులో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు నేషనల్ క్రైమ్ ఏజెన్సీ ప్రకటించింది. కంప్యూటర్ దుర్వినియోగ చట్టం నిందితుడిపై కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 20న ఈ సైబర్ దాడి జరిగింది. హీత్రో, బ్రస్సెల్స్, బెర్లిన్ లాంటి పెద్ద విమానాశ్రయాల్లో విమానాలు ఆలస్యమయ్యాయి. మరికొన్ని విమానాలు రద్దయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లో వేచి చూడాల్సి వచ్చింది.
విమానాశ్రయాలకు రూ.కోట్లలో నష్టం
ఈ దాడిలో ప్రధానంగా హ్యాకర్లు కాలిన్స్ ఏరోస్పేస్ కంపెనీ మ్యూజ్ సాఫ్ట్‌వేర్‌పై దాడి చేశారు. దీంతో శనివారం రాత్రి నుంచి ఆటోమేటెడ్ సిస్టమ్‌లు పని చేయలేదు. హ్యాకర్లు డేటాను తారుమారు చేసి డబ్బు డిమాండ్ చేశారు. యూరోపియన్ యూనియన్ సైబర్ ఏజెన్సీ ఈ దాడిని రాన్సమ్‌వేర్‌గా నిర్ధారించింది. హ్యాకర్లు సిస్టమ్‌లోకి చొరబడి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు చేస్తున్న సమయంలో అవాంతరాలు సృష్టించారు. ఫలితంగా ఎయిర్‌పోర్టులు మాన్యువల్ చెక్ ఇన్ ప్రక్రియలు ప్రారంభించాల్సి వచ్చింది. ఈ దాడి యూరప్‌లోని పెద్ద విమానాశ్రయాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. హీత్రోలో టెర్మినల్ 4లో ప్రయాణికులు గంటలు వేచి ఉన్నారు. బ్రస్సెల్స్ విమానాశ్రయంలో మాన్యువల్ బోర్డింగ్ చేపట్టారు. బెర్లిన్, ఇతర ప్రదేశాల్లో విమానాలు ఆలస్యంగా నడిచాయి. వేలాది ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సోమవారం వరకు ఈ సమస్యలు కొనసాగాయి. దీంతో రూ.కోట్లలో ఆర్థిక నష్టం వాటిల్లింది.
ఈ సైబర్ దాడి యూరప్ విమానయాన వ్యవస్థలో లోపాలను బహిర్గతం చేసింది. చెక్ ఇన్, బోర్డింగ్ కోసం సొంత వ్యవస్థ లేకపోవడం, కాలిన్స్ ఏరోస్పేస్ వంటి ఇతర సంస్థలపై విమానాశ్రయాలు ఆధారపడటం వల్ల ఒక్క దాడితో మొత్తం నెట్‌వర్క్ ప్రభావితమైంది. అధికారులు దీన్ని రాన్సమ్‌వేర్‌గా స్పష్టం చేశారు. రాన్సమ్‌వేర్ అనేది ఒక రకమైన సైబర్ దాడి. ఇందులో హ్యాకర్లు కంప్యూటర్ సిస్టమ్‌లోని వివరాలను లాక్ చేస్తారు. ఆ తర్వాత ఆ డేటాను తిరిగి అన్‌లాక్ చేయడానికి బాధితుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తారు. ఇటీవల రాన్సమ్‌వేర్ దాడులు పెరుగుతున్నాయి. పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడంతో దీని మూలాలను కనుగొనవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. యూరప్ విమానాశ్రయాల్లో సైబర్ భద్రత పెంచాల్సిన అవసరం ఉంది.
