
విమోచన వేడుకలు.. రాజకీయాలకోసం కాదు: రాంచందర్ రావు
తెలంగాణ బీజేపీ కార్యాలయంలో విమోచన దినోత్సవ వేడుకలు జరిగాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే అధికారికంగా చేయడం కాదన్న ఆయన రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. 1948 సెప్టెంబర్ 16 వరకూ నిజాంల పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం సెప్టెంబర్ 17న భారత సమాఖ్యలో విలీనమైంది.
నాటి నుంచి ప్రతి ఏడాది ఈరోజును రాష్ట్ర విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న వచ్చినా, హైదరాబాద్ సంస్థానంలో మాత్రం నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ పాలన మరో 13 నెలలు కొనసాగిందని, వారి పాలనలో హైదరాబాద్ సంస్థానం బానిసత్వంలో మగ్గిపోయిందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో అప్పటి భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో ప్రకటించిందని, 1948 సెప్టెంబర్ 13న ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ లోకి ప్రవేశించడంతో అయిదు రోజుల్లో నిజాం వారికి లొంగిపోయాడన్నారు రాంచందర్ రావు. 17న అతని లొంగుబాటుపై అధికారిక ప్రకటన రావడంతో హైదరాబాద్ భారత్ లో విలీనమైంది.
ఈ పోరాటంలో ఎంతోమంది తెలంగాణ ప్రజలు ప్రాణ త్యాగం చేశారని, రావి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం, చంద్రరాజేశ్వరరావు, షోయాబుల్లాఖాన్ వంటి నాయకులు కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఎంతో మంది పోరాడి..ఎంతో మంది ప్రాణ త్యాగాలతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఓటు బ్యాంకు కోసం రాజకీయ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గడిచిన మూడేళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు.
