
విమోచన చరిత్ర మరుగున పడకూడదు
తెలంగాణ విమోచన చరిత్ర మరుగున పడకూడదని, ప్రభుత్వాలు దీనిపై నిర్లక్ష్యం వహించడం సరికాదని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. నాడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు బీజేపీ నాయకులు ఉద్యమాన్ని ముందుండి నడిపించారని చెప్పారు. హైదరాబాద్లో భాస్కర యోగి రచించిన 'సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విమోచనే' పుస్తకావిష్కరణ కార్యక్రమానికి విద్యాసాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, శ్రీవర్థన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి
విద్యాసాగర్ రావు మాట్లాడుతూ భాస్కర యోగి ఇప్పటికే ఎన్నో పుస్తకాలు రచించారని, భారతీయ సంస్కృతి పరంపర గురించి అందరికీ తెలిసేలా ఎన్నో గొప్ప ప్రసంగాలు ఇచ్చారని తెలిపారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం కోసం 1998లో ఉద్యమం ప్రారంభమైందని, బీజేపీ నాయకులు దీన్ని ప్రాణప్రదంగా భావించారని వివరించారు. అప్పటి వరకు కార్యాలయాలకు పరిమితమైన కార్యక్రమాలు తర్వాత బహిరంగ సభలుగా మారాయని, లాల్ కృష్ణ అద్వానీ ముఖ్య అతిథిగా వచ్చి 120 మందికి పైగా స్వాతంత్య్ర సమర యోధులను సన్మానించారని చెప్పారు. తెలంగాణ విమోచన చరిత్ర మరుగున పడటం సమంజసం కాదని, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఉత్సాహంతో ఉద్యమం నడిపించారని పేర్కొన్నారు. పిల్లల పాఠ్యాంశాల్లో ఈ చరిత్ర చేర్చాలని, కొమురం భీం, షోయబుల్లా ఖాన్ వంటి మహనీయుల విగ్రహాలు హైదరాబాద్లో ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం కొనసాగిందని తెలిపారు. పార్టీలకు అతీతంగా నిజాం వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం జరిగిందని, ఎంతోమంది త్యాగాలు చేశారని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణ
లౌకికవాదుల వాదనలను అంగీకరించాల్సిన అవసరం లేదని, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో హైదరాబాద్ సంస్థానానికి విమోచనం జరిగిందని చెప్పారు. బ్రిటిష్, నిజాం ప్రభుత్వాలు పోరాటయోధులను జైల్లో పెట్టేందుకు ప్రయత్నించాయి. అండమాన్-నికోబార్ జైలు, నల్లమల అడవులు, కాలాపానీలలో చాలామందిని ఉంచారని వివరించారు. హైదరాబాద్ 1947 ఆగస్టు 15 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు నిజాం పాలనలో ఉండి, పోలీస్ యాక్షన్ ద్వారా విమోచన పొందిందని తెలిపారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారికంగా ఆవిష్కరించనున్నారని చెప్పారు. 18వ, 19వ శతాబ్దాల్లో హైదరాబాద్లో అనేక నాయకులు స్వాతంత్య్రం కోసం పోరాడారని, వారి కృషిని భావితరాలకు తెలియజేయడంలో నిర్లక్ష్యం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణలో దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయని, 1969 తెలంగాణ ఉద్యమంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారని, ఆంధ్రప్రదేశ్తో కలిసిన తర్వాత సామాజిక విభేదాలు కొనసాగాయని వివరించారు. తెలంగాణ యువతకు అవకాశాలు పెంపొందించాలని సూచించారు. భాస్కర యోగి రాసిన పుస్తకం ద్వారా చరిత్ర, పోరాటం స్పష్టమవుతాయని చెప్పారు.
