
వైభవంగా ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు
తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మొదటి రోజు హన్మకొండలోని చారిత్రాత్మక వేయి స్తంభాల గుడి వద్ద రాష్ట్రస్థాయి బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, జూపల్లి కృష్ణారావు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకల్లో వందలాది మహిళలు, యువతులు పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలు, నృత్యాలు, జానపద కళలతో వేడుకలు కళకళలాడాయి. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ప్రకృతి పట్ల ఉన్న గౌరవాన్ని, మహిళల సామూహిక జీవనాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు నిర్ణయించారన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ బతుకమ్మ ఆడే సంప్రదాయం మన ఆరోగ్యవంతమైన జీవనాన్ని గుర్తు చేస్తుందని, ఇది మనల్ని చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుందని చెప్పారు. ప్రకృతిని ఆరాధిస్తూ, చెరువుల రుణం తీర్చుకుంటూ చేసుకునే పండుగ బతుకమ్మ అన్నారు. మంత్రులు పొంగులేటి, జూపల్లి మాట్లాడుతూ ప్రభుత్వం బతుకమ్మ పండుగ నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలతో పాటు, ప్రభుత్వం కూడా చల్లగా ఉండాలని నవరాత్రులూ భక్తిశ్రద్ధలతో పూజలు చేయాలన్నారు. మహిళలంతా సంఘటితంగా ఏర్పడి ఎన్నో అంశాలను పాటల రూపంలో మలిచి ఆడిపాడుకునే గొప్ప సాంప్రదాయమే బతుకమ్మ అన్నారు.
గత పాలకులపై కొండా సురేఖ విమర్శలు
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ గత పాలకుపై తీవ్ర విమర్శలు చేశారు. కొండా సురేఖ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మకు అసలు రూపం లేకుండా చేశారని, బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ అంటే డిస్కో డ్యాన్స్, వెస్ట్రన్ పాటలు అని, బతుకమ్మ సంస్కృతిని నాశనం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజమైన తెలంగాణ సాంస్కృతిక పండుగగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామని వ్యాఖ్యానించారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.
తొమ్మిది రోజుల పాటు జరుగనున్న ఉత్సవాలు చివరి రోజు సెప్టెంబర్ 30న హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలతో ముగియనున్నాయి. ఈ నెల 27న ఎల్బీ స్టేడియంలో 10 వేల మంది మహిళలతో 63 అడుగుల ఎత్తైన బతుకమ్మ పేర్చి గిన్నిస్ రికార్డు సాధించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. చెరువుల వద్ద నిమజ్జన కార్యక్రమాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. తెలంగాణ సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటేలా ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని మంత్రులు, అధికారులు తెలిపారు.
