Let's talk: editor@tmv.in
వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

T Venkata Ramana
17 సెప్టెంబర్, 2025

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ శుద్ధి కార్యక్రమం చేపట్టినట్లు ఆయన చెప్పారు. సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తామని వివరించారు. ఉగాది ఆస్థానం, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు,వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి చేయడం ఆనవాయితీగా వస్తోందని ఈ సందర్భంగా ఈవో వెల్లడించారు.

అంతకు ముందుగా స్వామివారికి వస్త్రం కప్పి పూజ సామగ్రికి,ఇతర ఉప ఆలయాలు,ఆలయ గోడలు సుగంధ ద్రవ్యాల పరిమళంతో శుద్ధి చేశామన్నారు. అనంతరం శుద్ధి కార్యక్రమాన్ని ముగించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నివేదనలు సమర్పించి భక్తుల దర్శనాలకు అనుమతించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు,అదనపు ఈవో వెంకయ్య చౌదరి, పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అష్టదళ పాదపద్మారాధన, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు.

సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురు చూసే ఉత్సవాలు. ఈనెల సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ ఈ మహోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఉత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టింది.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే

తమిళంలో, కోయిల్ అంటే ‘పవిత్ర పుణ్యక్షేత్రం’, ఆళ్వార్ అంటే “భక్తుడు”, తిరు అంటే “శ్రేష్ఠo”, మంజనం అంటే “స్నానం”. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే గర్భగుడి, ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం అని అర్థం. ఈ శుద్ధి జరుగుతున్న సమయంలో శ్రీవారి ప్రధాన మూర్తిని ఒక తెల్లని వస్త్రంతో కప్పి ఉంచుతారు. అన్ని దేవతా మూర్తులను, ఇతర వస్తువులను గర్భగుడి నుండి బయటికి తెచ్చి, కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ మొదలైన వాటితో కూడిన “పరిమళం” అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు.

ఈ మొత్తం కార్యాచరణ ఉదయం 6 నుండి ఉదయం 10 గంటల వరకు ఒక మహా యజ్ఞం లా జరుగుతుంది. తర్వాత ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగించి లోపల ఇతర పరివార దేవతలు, దీపం, పూజ వస్తువులను మరల లోనికి తీసుకొస్తారు . అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతుంది.

భద్రతా ఏర్పాట్లపై సమీక్ష

టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ విజిలెన్స్, తిరుపతి జిల్లా పోలీసు అధికారులతో అన్నమయ్య భవనంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనుండటంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం - Tholi Paluku