
వన్ నేషన్ - వన్ ట్యాక్స్ - చారిత్రాత్మక నిర్ణయం
దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రజలకు మేలు కలిగించే పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, అందులో వన్ నేషన్ - వన్ ట్యాక్స్ అమలు అనేది చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. గురువారం అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ వద్దనున్న మాసినేని గ్రాండ్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్ లో సూపర్ జిఎస్టీ - సూపర్ సేవింగ్స్ లో భాగంగా అధికారులు, డీలర్లతో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్, కమర్షియల్ టాక్స్ జాయింట్ కమిషనర్ హేమ, చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శేషాంజనేయులు, సెక్రెటరీ రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
చాణక్యుడి కాలం నుంచి ఇదే పద్ధతి
మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల్లో ఏ వర్గానికి, ఏ సెక్టార్లో ఎక్కువ ఆదాయం వస్తుందో వాటి నుంచి ప్రభుత్వం పన్నులు వసూలు చేయడం జరిగిందని, పురాణ కాలంలోని చాణక్యుడి కాలం నుంచి ఇదే పద్ధతి ఉండేదన్నారు. ఎన్నికల సమయంలో మామూలుగా ఎన్నికల తాయిలాలు ఉంటాయని, కానీ ఎన్డీఏ ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రజలకు మేలు కలిగించే పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రతినిధిగా జీఎస్టీ సంస్కరణల అమలుకు జరిగే సమావేశాల్లో తాను పాల్గొనడం ఎంతో సంతోష దాయకం అని పేర్కొన్నారు. వన్ నేషన్ - వన్ ట్యాక్స్ అమలు అనేది చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. ప్రజలకు మేలు చేయాలని తపన ఉండే ఎన్డీఏ ప్రభుత్వం అందించిన ఫలాలకు ఒక గొప్ప ఉదాహరణ జీఎస్టీ 2.0 అమలు అని తెలిపారు. పేదలకు ఉపయోగపడే అన్ని రకాల వస్తువుల పై జీఎస్టీ తగ్గించామని, జీఎస్టీ సంస్కరణల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 8 వేల కోట్ల రూపాయలు ఆదా అవుతోందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి దాదాపు సంవత్సరానికి 18 నుంచి 20 వేలు ఆదా అయ్యేలా సూపర్ జీఎస్టీ 2. 0 అమలు ద్వారా మేలు కలుగుతోందని అన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) తో మెడికల్ కాలేజీల నిర్వహణ ద్వారా నాణ్యమైన విద్య, వసతులు, నిర్వహణ ఏర్పాటు అవుతాయని, జగన్ రాష్ట్రాన్ని వెనక్కు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపు ఫలాలు సామాన్యులకు చేరాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
100 రోజుల లక్ష్యంతో..
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 100 రోజుల లక్ష్యం పెట్టుకుని, దానికి అనుగుణంగా హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ వెడల్పు పనులను పూర్తి చేశామన్నారు. జిల్లాలో ఉద్యాన పంటలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ హార్టికల్చర్ హబ్ గా నాలుగు సంవత్సరాలలో తయారయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతపురం జిల్లా పూర్ కాదు అని, రాష్ట్రంలో నంబర్ వన్ జిల్లా అయ్యేలా అభివృద్ధి చేస్తామన్నారు. జీఎస్టీ సంస్కరణలను సామాన్యుడి దగ్గరికి తీసుకెళ్లేందుకు అసోసియేషన్ల వారందరూ సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సూపర్ జిఎస్టీ - సూపర్ సేవింగ్స్ అమలు అనేది విప్లవాత్మక మార్పు అన్నారు. జిఎస్టీ తగ్గింపుతో అందరూ బాధ్యతగా తీసుకుని ధరలు తగ్గించాలని, సామాన్యులకు మేలు చేకూర్చాలన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం గత 15 రోజుల నుండి జిల్లాలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి సెక్టార్ల డీలర్లు, అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ రేట్లను అమలు చేయాలని, తనిఖీలు కూడా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో కమర్షియల్ టాక్స్ జాయింట్ కమిషనర్ హేమ, డిప్యూటీ కమిషనర్ భాస్కర్ వల్లి, అసిస్టెంట్ కమిషనర్లు మౌనిక, రాకేష్, సుజిత, సురేందర్ రెడ్డి, సోనియా తార, చందు, కృష్ణవేణి, సంజీవరెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ మెంబర్లు, ఇతర అధికారులు, ఎలక్ట్రానిక్స్, మెడిసిన్స్, ఆటోమొబైల్స్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
