Let's talk: editor@tmv.in
‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ కమిటీ గడువు పెంపు

‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ కమిటీ గడువు పెంపు

Pinjari Chand
19 మార్చి, 2026

ప్రస్తుతం దేశంలో వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరుగుతుండగా, ఈ వ్యవస్థలో అన్ని ఎన్నికలను ఒకే సమయంలో నిర్వహించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన వన్‌నేషన్–వన్‌ ఎలక్షన్‌ బిల్లు ఆలస్యమ్యే అవకాశం ఉంది. తాజాగా ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ బిల్లుపై నివేదిక సమర్పించడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)గడువును లోక్‌సభ బుధవారం పొడిగించింది. 2026 వర్షకాల సమావేశాల చివరి వారంలోని తొలి రోజు వరకు కమిటీకి సమయం ఇచ్చింది. ఈ మేరకు జేపీసీ ఛైర్మన్ పీ పీ చౌదరి సభలో తీర్మానం ప్రవేశపెట్టగా, లోక్‌సభ ఆమోదించింది. రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, 2024, యూనియన్ టెరిటరీస్ చట్టాల (సవరణ) బిల్లు, 2024పై నివేదిక సమర్పణకు మరింత సమయం అవసరమని ఆయన తెలిపారు. ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’గా పిలవబడే ఈ సంస్కరణలో భాగంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే విధానాన్ని అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగా చట్టపరమైన మార్పులు తీసుకురావడమే ఈ బిల్లుల ఉద్దేశ్యం. ఈ బిల్లులు 2024 డిసెంబర్ 17న లోక్‌సభలో ప్రవేశపెట్టగా, తదుపరి పరిశీలన కోసం జేపీసీకి పంపించారు. ప్రస్తుతం కమిటీ ఈ బిల్లులపై సమగ్రంగా అధ్యయనం కొనసాగిస్తోంది.

ఇటీవల మార్చి 9న న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ అనెక్సులో జేపీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం చౌదరీ మాట్లాడుతూ వన్ నేషన్–వన్ ఎలక్షన్ దేశ ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన ప్రతిపాదన, ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదని అన్నారు. సమావేశంలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కూడా పాల్గొని తన అనుభవాన్ని కమిటీతో పంచుకున్నారు. ఎన్నికలను సమకాలీకరించడం వల్ల సమయం, వనరులు ఆదా అవుతాయని కమిటీ సభ్యులకు వివరించారు.ఈ ప్రతిపాదన అమలుతో దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణలో సమన్వయం వంటి ప్రయోజనాలు ఉంటాయని కేంద్రం భావిస్తోంది. అయితే, ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.