Let's talk: editor@tmv.in
వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: ప్రధాని నరేంద్ర మోడీ

వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: ప్రధాని నరేంద్ర మోడీ

Dantu Vijaya Lakshmi Prasanna
4 మార్చి, 2026

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘ఎక్స్’ వేదికగా ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. భూమి పర్యావరణ వ్యవస్థలను నిలబెట్టే అద్భుతమైన జంతు వైవిధ్యాన్ని ఈ రోజు మనకు గుర్తుచేస్తుందని పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ, సంరక్షణ, స్థిరమైన అభివృద్ధి విధానాలు, జీవావాసాల రక్షణ పట్ల భారత్ తన నిబద్ధతను మరింత బలపరుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

భారతదేశం ప్రపంచంలోని అత్యంత విశిష్టమైన వన్యప్రాణులకు నిలయమని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచ పులుల జనాభాలో 70 శాతం కంటే ఎక్కువ పులులు భారత్‌లోనే ఉన్నాయని, ఒక్క కొమ్ము గల ఖడ్గమృగాల అత్యధిక జనాభా మన దేశంలోనే ఉందని చెప్పారు. ఆసియాటిక్ ఏనుగుల సంఖ్యలో భారత్ ముందంజలో ఉందని, అలాగే గంభీరమైన ఆసియాటిక్ సింహం ప్రపంచంలో ఎక్కడా కాకుండా భారత్‌లో మాత్రమే నివసిస్తోందని ఆయన గుర్తు చేశారు.

వన్యప్రాణుల పరిరక్షణ దిశగా ఎన్‌డీఏ ప్రభుత్వం చేపట్టిన చర్యలను కూడా ప్రధాని వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ విధానాలను పంచుకునేందుకు ‘ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్’ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఘరియాల్, స్లాత్ బేర్‌ల సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, అలాగే చీతాల పునరావాసం (ట్రాన్స్‌లోకేషన్) వంటి చారిత్రక చర్యల ద్వారా భారత్ వన్యప్రాణుల రక్షణలో ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తోందని ప్రధాని మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్ 2026

ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ను భారత్ నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా పెద్ద పిల్లి జాతుల (బిగ్ క్యాట్స్) సంరక్షణను బలోపేతం చేయడానికి ఏర్పాటు చేశారు. పులి, సింహం, చిరుత, మంచు చిరుత, జాగ్వార్, ప్యూమా, వంటి ఏడు బిగ్ క్యాట్ జాతుల పరిరక్షణకు సంబంధించి దేశాల మధ్య సహకారం, ఉత్తమ పద్ధతుల మార్పిడి, పరిశోధన, సామర్థ్య వృద్ధి లక్ష్యంగా ఈ అలయన్స్ పనిచేస్తుంది.

ఈ అలయన్స్ ద్వారా జీవావాసాల రక్షణ, అక్రమ వేట నిరోధం, వన్యప్రాణుల సంఘర్షణ, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటి అంశాలపై సమన్వయ చర్యలు చేపడతారు. అంతేకాకుండా, బిగ్ క్యాట్స్ సంరక్షణకు అవసరమైన నిధుల సమీకరణ, శిక్షణా కార్యక్రమాలు, అంతర్జాతీయ అవగాహన పెంపు వంటి చర్యల ద్వారా ప్రపంచ స్థాయిలో వన్యప్రాణుల పరిరక్షణకు భారత్ కీలక పాత్ర పోషిస్తోంది.

భారతదేశం వన్యప్రాణుల సంరక్షణలో తన ఆధిపత్యాన్ని చాటుతూ, 95 దేశాల ప్రతినిధులతో ప్రపంచంలోనే మొదటి 'బిగ్ క్యాట్ సమ్మిట్'ను 2026లోనే నిర్వహించనుంది. పులి, సింహం, చిరుత వంటి ఐదు రకాల పెద్ద పిల్లి జాతులు ఉన్న ఏకైక దేశంగా భారత్, ఈ సదస్సు ద్వారా 'వైల్డ్ లైఫ్ టూరిజం'లో గ్లోబల్ లీడర్‌గా ఎదగనుంది.

95 దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సు అడవి జీవ సంరక్షణ, శాస్త్రీయ సహకారం, సుస్థిర వైల్డ్‌లైఫ్ పర్యాటకంపై చర్చించనుంది. భారత్ ప్రపంచంలోని ఏడు పెద్ద పిల్లి జాతుల్లో(పులి, సింహం, చిరుత, మంచు చిరుత, జాగ్వార్, ప్యూమా) ఐదింటికి నిలయం కావడం మన దేశానికి ప్రత్యేకత. ఈ నాయకత్వం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ద్వారా మరింత బలపడింది. ఈ అంతర్జాతీయ సంస్థకు ప్రధాన కార్యాలయం భారత్‌లోనే ఉండడం మన దేశానికి గర్వకారణం. ఈ సమ్మిట్‌తో పర్యాటకం కేవలం ఆర్థిక రంగం కాకుండా, అంతర్జాతీయ దౌత్య సాధనంగా మారుతోంది.

‘చీతా పునరుద్ధరణ ప్రాజెక్టు’

అలాగే ఇటీవల భారత ప్రభుత్వ౦ ప్రతిష్టాత్మక చేపట్టిన ‘చీతా పునరుద్ధరణ ప్రాజెక్టు’లో భాగంగా, ఆఫ్రికా దేశమైన బోట్స్వానా నుంచి 9 చీతాలు (6 ఆడ, 3 మగ) మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ కు చేరుకోవడంతో దేశంలో చీతాల సంఖ్య 48కి పెరిగింది. భారత వాయుసేన ప్రత్యేక విమానం, హెలికాప్టర్ల సహకారంతో ఈ చీతాలను తరలించగా, కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్వయంగా క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లో విడుదల చేశారు. సుమారు 70 ఏళ్ల తర్వాత భారతదేశంలో చీతాల పునఃప్రవేశం పర్యావరణ సమతుల్యతకు కీలకంగా మారనుంది.