Let's talk: editor@tmv.in
వన్డేలో చరిత్ర సృష్టించిన రషీద్‌ ఖాన్‌

వన్డేలో చరిత్ర సృష్టించిన రషీద్‌ ఖాన్‌

Shaik Mohammad Shaffee
10 అక్టోబర్, 2025

అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో అఫ్గాన్ తరఫున 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌల‌ర్‌గా రికార్డు నెలకొల్పాడు. అబుదాబిలో బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి వన్డేలో ఈ అఫ్గాన్ స్పిన్ మాంత్రికుడు ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 10 ఓవర్లు వేసిన రషీద్ 38 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హసన్ మీర్జా, జాకర్ అలీ, నురుల్ హసన్ వికెట్లను తీశాడు.

అఫ్గానిస్తాన్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్ ఖాన్ అగ్రస్థానంలో ఉండగా, సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ (174 మ్యాచుల్లో 176 వికెట్లు) రెండవ స్థానంలో, దౌలత్ జద్రాన్ (82 మ్యాచుల్లో 115 వికెట్లు) మూడవ స్థానంలో ఉన్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 48.5 ఓవర్లలో 221 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఒకానొక దశలో 53/3గా ఉన్న బంగ్లాదేశ్‌ స్కోర్ బోర్డును తౌహిద్ హృదోయ్ (56), మెహిదీ హసన్ మీర్జా (60) నాల్గవ వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యంతో నిలబెట్టారు. అయితే హృదోయ్ రనౌట్, రషీద్ ఖాన్ మూడు వేగవంతమైన వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ త్వరగా ఆలౌట్ అయ్యింది. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, అజ్మతుల్లా ఒమర్‌జాయ్ 3, అల్లా ఘజన్‌ఫర్ 2 వికెట్లు తీశారు.

ఆ తర్వాత 222 పరుగుల లక్ష్యంతో ఆఫ్గనిస్థాన్ బరిలోకి దిగింది. రహ్మానుల్లా గుర్బాజ్ (50), ఇబ్రహీం జద్రాన్ (23) మొదటి వికెట్‌కు 52 పరుగులు జోడించారు. గుర్బాజ్, రహ్మత్ షా (50)తో కలిసి మూడవ వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (44 బంతుల్లో 40 పరుగులు), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (33 నాటౌట్) జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఫలితంగా ఆఫ్గానిస్తాన్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ విజయంతో ఆఫ్గానిస్తాన్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. కాగా దీనికి ముందు జరిగిన టీ20 సిరీస్‌ను బంగ్లాదేశ్ 3-0తో గెలుచుకున్న సంగతి తెలిసిందే.

రషీద్ ఖాన్ వన్డే క్రికెట్ కెరీర్ గణాంకాలను ఒకసారి గమనిస్తే, ఆయన 2015లో అంతర్జాతీయ వన్డేల్లో జింబాబ్వేతో ఆడిన మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. మొత్తం 115 వన్డేలు ఆడిన ఆయన 20.28 సగటుతో 202 వికెట్లు పడగొట్టాడు. అతడి కెరీర్‌లో బెస్ట్ బౌలింగ్ 7/18. వన్డేల్లో మొత్తం 1,384 పరుగులు చేశాడు రషీద్. ఇందులో 5 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. అతడి అత్యధిక స్కోరు 60 పరుగులు (నాటౌట్). బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శనతో పాటు, కీలక సమయాల్లో బ్యాటింగ్‌లోనూ రాణించడం రషీద్ ఖాన్ ప్రత్యేకత.

వన్డేలో చరిత్ర సృష్టించిన రషీద్‌ ఖాన్‌ - Tholi Paluku