
వన్యప్రాణుల అక్రమ రవాణా
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో వన్యప్రాణుల అక్రమ రవాణా మరోసారి వెలుగులోకి వచ్చింది. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు ఆదివారం తెల్లవారుజామున తనిఖీ చేసినప్పుడు 67 రకాల అరుదైన జంతువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ విషయాన్ని అధికారులు సోమవారం వెల్లడించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పట్టుబడిన జంతువులలో లియోపార్డ్ టార్టాయిస్లు, వివిధ రకాల తాబేళ్లు, మీర్కాట్లు, హైరాక్స్లు, షుగర్ గ్లైడర్లుతో పాటు అత్యంత అరుదైన, అంతరించిపోతున్న జాతి అయిన మానిటర్ లిజార్డ్స్ ఉన్నాయి. వీటన్నింటినీ ప్రయాణికుడు ప్రత్యేకంగా తయారు చేయించుకున్న తన లగేజ్ బ్యాగ్ లో దాచి ఉంచాడు.
ఇక వన్యప్రాణి నేర నియంత్రణ బ్యూరో ఈ కేసులో జోక్యం చేసుకుని, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద “డిపోర్టేషన్ ఆర్డర్” జారీ చేసింది. దాంతో అధికారులు స్వాధీనం చేసుకున్న జంతువులను తిరిగి బ్యాంకాక్కు తరలించారు. అంతేకాక ఈ చర్యల్లో రెస్క్యూ అసోసియేషన్ ఫర్ వైల్డ్ లైఫ్ వెల్ఫేర్ అనే స్వచ్ఛంద సంస్థ నిపుణులు పర్యవేక్షించి పట్టుబడిన జంతువులను తక్షణమే రక్షించి, అవసరమైన ప్రాథమిక వైద్యం అందించారు.
అదనపు సమాచారం ప్రకారం వన్యప్రాణుల అక్రమ రవాణా ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద అక్రమ వ్యాపారంగా పేరుగాంచింది . ముఖ్యంగా దక్షిణాసియా దేశాల నుంచి అరుదైన జంతువులను భారత్, యూరప్, వంటి దేశాలకు తరలించే ముఠాలు పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయని వన్యప్రాణి సంరక్షణ అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఇలాంటి అక్రమ రవాణా ఘటనలు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే ప్రమాదం ఉందని, అదేవిధంగా వన్యప్రాణుల ఉనికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి కేసులు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని కస్టమ్స్ అధికారులు స్పష్టం చేశారు.
