Let's talk: editor@tmv.in
వీధి విక్రయదారుల మేలు దిశగా ‘ఆపరేషన్ లంగ్స్’

వీధి విక్రయదారుల మేలు దిశగా ‘ఆపరేషన్ లంగ్స్’

FL - YUGDR
24 సెప్టెంబర్, 2025

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో గల ఫుట్పాతులపై, రోడ్లపై, ప్రధాన జంక్షన్ లలో గల తాత్కాలిక ఆక్రమణలను తొలగించి వాటికి రక్షణ, ప్రజలకు సౌకర్యాన్ని కల్పిస్తూ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా వీధి విక్రయదారుల మేలు దిశగా ఆపరేషన్ లంగ్స్ కార్యాచరణ జరుగుచున్నదని, అర్హులైన వీధి విక్రయదారులను గుర్తించి వారి వ్యాపార లబ్ధికి, జీవన భృతికి మేలు చేకూర్చే దిశగా జీవీఎంసీ చర్యలు చేపట్టిందని, ఈ కార్యాచరణ పై వీధి విక్రయదారులు ,ప్రజలు ఎటువంటి అపోహలు, వదంతులు,అసత్య ప్రచారాలను నమ్మవద్దని యుసిడి ప్రాజెక్టు డైరెక్టర్ పిఎం.సత్యవేణి మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

ఆ దిశగా ఇప్పటికే జోనల్ కార్యాలయాలలో స్ట్రీట్ వెండింగ్ కమిటీ సభ్యులతో జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు జీవీఎంసీ జోనల్ కమిషనర్లు సమావేశాలు నిర్వహించి నగర పరిశుభ్రత ,పరిరక్షణ, నగర ప్రజలకు , పాదచారులకు,వాహనదారులకు కల్పించే సౌకర్యం, వీధి విక్రయదారులకు వ్యాపార రక్షణ, మేలు కల్పించే దిశగా.. వారు ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేందుకు గానూ జీవీఎంసీ చేపడుతున్న చర్యలు, అందుకు చేపట్టిన ఆపరేషన్ లంగ్స్ కార్యాచరణ ముఖ్య ఉద్దేశ్యాన్ని స్ట్రీట్ వెండింగ్ కమిటీ సభ్యులకు జోనల్ కమిషనర్లు అవగాహన పరిచి వివరించడం జరిగిందని ఆమె తెలిపారు.

ఆపరేషన్ లంగ్స్ 2.0 కార్యాచరణలో నగరంలో గల తాత్కాలిక ఆక్రమణలను తొలగించిన నేపథ్యంలో నైట్ ఫుడ్ కోర్ట్ తొలగింపులో పలు వీధి విక్రయదారులకు , అలాగే నగరంలో తాత్కాలిక ఆక్రమణల తొలగింపులో పలు వీధి విక్రయ దారులకు వ్యాపారానికి అర్హత కలిగి గుర్తింపు పొందిన వారికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్ట్రీట్ వెండర్స్ నియమ నిబంధనలు ,స్ట్రీట్ వెండింగ్ స్కీమ్ నిబంధనల పరిగణన ప్రకారం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను జీవీఎంసీ రూపొందిస్తుందని ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు.

అలాగే నగరంలో పట్టణ ప్రణాళిక విభాగం ద్వారా ఇప్పటికే 21 వెండింగ్ జోన్లను గుర్తించి ప్రభుత్వానికి నివేదించడమైనదని , అవి సరిపోనందున అదనంగా మరికొన్ని వెండింగ్ జోన్ల ను గుర్తించి ఏర్పాటుకు నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి నివేదించడం జరుగునని , యుసిడి విభాగం అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో వీధి విక్రయదారుల వ్యాపారానికి అర్హత, గుర్తింపు ప్రమాణాలను ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా ఇప్పటికే చేపట్టిన సర్వే 90% పూర్తయినదని ఆమె తెలిపారు.

అలాగే వీధి విక్రయదారులు గా వ్యాపారం చేస్తూ ( బి.పి.ఎల్) బిలో పావర్టీ లైన్ కు చెందిన వారై , 18 సంవత్సరాలు వయస్సు పూర్తయి ఉండాలని, స్త్రీట్ వెండర్ గా గుర్తింపు పొంది, జీవీఎంసీ పరిధిలో మాత్రమే వ్యాపారం చేస్తూ ఉన్నవారై ఉండాలని, ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే వీధి వ్యాపారస్తునిగా హోదా కల్పించబడుతుందని, ఒకచోట వ్యాపారం చేస్తూ..మరొకచోట కూడా వ్యాపారం చేసుకునేందుకు అనర్హులని, ప్రస్తుతం జీవీఎంసీ నిర్వహిస్తున్న ఆక్రమణల తొలగింపులో ఉండి ఉండాలని, జీవీఎంసీ ఇటీవల నిర్వహించిన వీధి వ్యాపారస్తుల గుర్తింపు సర్వేలో పేరు నమోదయి, సంబంధిత నమోదు సంఖ్య కలిగి ఉండాలని, మెప్మా పథకాలలో నమోదయి ఉండాలని, డిజిటల్ పేమెంట్ లావాదేవీల రికార్డులు కలిగి ఉండాలని , ఆధార్, రైస్ కార్డు, జీవీఎంసీ ద్వారా జారీ చేయబడిన వీధి వ్యాపారస్తుల గుర్తింపు కార్డు, గుర్తింపు కార్డు కొరకు జీవీఎంసీ కమిషనర్ వారి పేరుతో చెల్లించిన బ్యాంకు రసీదు, వ్యాపారానికి సంబంధించిన డిజిటల్ లావాదేవీల రుజువులు ,ఫోన్ పే ,గూగుల్ పే, పేటియం ద్వారా జరిగిన లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ ప్రతులు కలిగి ఉండాలని , ఇలా అన్నీ కలిగి గుర్తింపుకు అర్హత కలిగిన వీధి వ్యాపారస్తులకు గుర్తించిన వెండింగ్ జోన్లలో వ్యాపారం చేసుకునేందుకు వెసులుబాటు కల్పించడం జరుగునని, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు, ముఖ్యంగా పీఎంస్వనిది పథకం లబ్ధికి అర్హత కలిగి ఉంటారని ప్రాజెక్ట్ డైరెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యాచరణ దిశగా జీవీఎంసీ తగు చర్యలు చేపట్టిందని, జోనల్ స్థాయిలో జోనల్ కమిషనర్ల పర్యవేక్షణలో యు సి డి విభాగం అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్లు ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నారని తెలిపారు.

ఆపరేషన్ లంగ్స్ ద్వారా ఆక్రమణలు తొలగింపు విషయమై వస్తున్న ఎటువంటి అపోహలు, వదంతులు,అసత్య ప్రచారాలను ప్రజలు, వీధి విక్రయదారులు నమ్మవద్దని ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.

వీధి విక్రయదారుల మేలు దిశగా ‘ఆపరేషన్ లంగ్స్’ - Tholi Paluku