
వదులుకుంటేనే ఓటమి: విరాట్ కోహ్లీ
టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో తన భవిష్యత్తుపై నెలకొన్న ఊహాగానాలకు తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో జరగబోయే కీలకమైన మూడు వన్డేల సిరీస్‌కు ముందు కోహ్లీ చేసిన ఒక భావోద్వేగ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీ20లు, టెస్టుల నుంచి వీడ్కోలు పలికి, ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న కోహ్లీ.. భారత జట్టుతో కలిసి ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్ గురించి వస్తున్న ప్రచారంపై అతను పరోక్షంగా స్పందించాడు. కోహ్లీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ, "మనం ఎప్పుడైతే చేతులెత్తేస్తామో (గివ్ అప్ చేస్తామో) అప్పుడు మాత్రమే మనకు ఓటమి వస్తుంది" అనే అర్థం వచ్చేలా రాసుకొచ్చాడు. ఈ మాటలు కోహ్లీ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు ఈ ట్వీట్‌ను అతడి పోరాట స్ఫూర్తికి, ఇప్పట్లో ఆటను వదిలే ప్రసక్తే లేదనే పరోక్ష సంకేతంగా భావిస్తున్నారు.
2027 ప్రపంచకప్‌పై సందేహాలు
వాస్తవానికి, 2027 వన్డే ప్రపంచకప్ వరకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టులో కొనసాగడం కష్టమేనని, యువ ఆటగాళ్ల కోసం బీసీసీఐ వీరికి వీడ్కోలు పలుకుతుందని క్రీడా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి వంటి వారు సైతం.. ఆస్ట్రేలియా సిరీస్‌లో కోహ్లీ ప్రదర్శన కీలకం. ఇందులో విఫలమైతే, కోహ్లీ వన్డేల నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలోనే తాను పోరాటాన్ని ఆపనని కోహ్లీ చేసిన ట్వీట్.. తన మీద వస్తున్న ఒత్తిడికి, పుకార్లకు సమాధానంగా నిలుస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2027 ప్రపంచకప్ వరకు తాను తప్పకుండా ఉంటానని కోహ్లీ పరోక్షంగా చెప్పాడని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రో-కో పునరాగమనంపై గంభీర్ ఏమన్నారంటే?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత విరాట్ కోహ్లీ చివరిసారిగా టీమిండియా జెర్సీ ధరించాడు. టెస్ట్ క్రికెట్‌కు రోహిత్ శర్మ వీడ్కోలు పలికిన కొద్ది రోజులకే కోహ్లీ కూడా టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించడం, బీసీసీఐలో రాజకీయాలు నడుస్తున్నాయనే వాదనలకు దారితీసింది. అయితే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా జట్టులోకి తిరిగి వస్తున్న నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు.
"విరాట్, రోహిత్ ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లు. వారి అనుభవం టీమ్‌కి అమూల్యం. 2027 వరల్డ్‌కప్ ఇంకా రెండున్నరేళ్ల దూరంలో ఉంది కాబట్టి ప్రస్తుతం దృష్టి ఆ టోర్నీపై కాకుండా ఈ పర్యటనలో మంచి ప్రదర్శనపై ఉండాలి. ఈ ఇద్దరి పునరాగమనం జట్టుకు సపోర్ట్‌గా నిలుస్తుంది" అని గంభీర్ పేర్కొన్నారు. కోచ్ వ్యాఖ్యలు కూడా భవిష్యత్తుపై గ్యారెంటీ ఇవ్వనప్పటికీ, ఈ ఇద్దరు దిగ్గజాల అనుభవం జట్టుకు ఎంత ముఖ్యమో స్పష్టం చేశాయి.
ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ రికార్డులు
ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. అన్ని ఫార్మాట్లలో కలిపి కంగారూల దేశంలో కోహ్లీ 10 అంతర్జాతీయ సెంచరీలు సాధించి, ఆసియా క్రికెటర్లలో అగ్రస్థానంలో ఉన్నాడు. టెస్టు, వన్డే, టీ20 - ఈ మూడు ఫార్మాట్లలో ఆస్ట్రేలియా గడ్డపై 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక విదేశీ ఆటగాడు విరాట్ కోహ్లీనే. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో కోహ్లీ 7 శతకాలతో సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. వన్డేల్లో ఆస్ట్రేలియా గడ్డపై 29 మ్యాచ్‌లలో 51.03 సగటుతో 1,327 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
