Let's talk: editor@tmv.in
విదేశాల‌పై ఆధార‌ప‌డ‌ట‌మే అతిపెద్ద శ‌త్రువు : ప్రధాని

విదేశాల‌పై ఆధార‌ప‌డ‌ట‌మే అతిపెద్ద శ‌త్రువు : ప్రధాని

FL - BRTH
21 సెప్టెంబర్, 2025

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హెచ్1బి వీసాల‌పై ట్రంప్ రుసుము పెంపు నేప‌థ్యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గుజ‌రాత్ లోని భావ్ న‌గ‌ర్ లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. దేశంలో స్వావ‌లంబ‌న చాలా ముఖ్య‌మైన అంశ‌మ‌ని అన్నారు. ఇత‌ర దేశాల‌పై ఆధార‌ప‌డ‌ట‌మే భార‌తదేశ నిజ‌మైన శ‌త్రువ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌పంచంలో భార‌త్ కు పెద్ద శత్రువులు లేరు కానీ ఇత‌ర దేశాల‌పై ఆధార‌ప‌డ‌ట‌మే నిజ‌మైన శత్రువు అని మోదీ వ్యాఖ్యానించారు. భార‌తీయులంద‌రూ క‌లిసి ఈ శ‌త్రువును ఓడించాలని, ఇత‌ర దేశాల‌పై ఆధార‌ప‌డ‌టం త‌గ్గించాల‌ని సూచించారు. విదేశాల‌పై ఎంత ఎక్కువ‌గా ఆధార‌ప‌డితే.. దేశం అంత ఎక్కువ‌గా విఫ‌ల‌మ‌వుతుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశంగా.. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ మారాల‌ని ఆకాంక్షించారు. ప్రపంచ శాంతి, స్థిర‌త్వం, వృద్ధి కొన‌సాగించాలంటే ఆత్మ‌నిర్భ‌ర్గా మారడం చాలా అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు.

భార‌త ఓడ‌రేవుల విష‌యంలో కీల‌క సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌స్తామ‌ని మోదీ ప్ర‌క‌టించారు. ఒకే దేశం, ఒకే డాక్యుమెంట్, ఒకే ప్రాసెసింగ్ తీసుకురావడం ద్వార పోర్టుల ద్వార జ‌రిగే వాణిజ్యం సుల‌భ‌త‌రం అవుతుంద‌ని మోదీ తెలిపారు. చిప్ ల‌తో మొద‌లుకొని భార‌త్ అన్నింటినీ త‌యారు చేయాల‌ని కోరారు. శాంతి, స్థిర‌త్వం, వృద్ధి సాధించడానికి దేశంలో స్వాలంబ‌న అవ‌స‌ర‌మ‌ని అన్నారు. దేశంలో ఉన్న అన్ని స‌మ‌స్య‌ల‌కు అదే మార్గ‌మ‌ని చెప్పారు. భార‌త్ ఎద‌గ‌డానికి ఓడ‌రేవులు కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని అన్నారు. ఓడ‌రేవుల‌ను భార‌తదేశ వెన్నెముక‌గా అభివ‌ర్ణించారు.

పెద్ద నౌక‌ల‌కు మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌డం ద్వార భార‌త ఓడ‌రేవు రంగాన్ని అభివృద్ధి చేయ‌డానికి చారిత్రాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపారు. భార‌తదేశంలో స్వావ‌లంబ‌న‌కు ఉన్న అవ‌కాశాల‌ను మోదీ ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. ఐఎన్ఎస్ విక్రాంత్ త‌యారీకి వాడిన ఇనుము గురించి గుర్తు చేశారు. దాదాపు 40కి పైగా నౌక‌లు, జ‌లాంతార్గ‌ములు తీసుకువ‌స్తే.. వాటిలో కొన్ని త‌ప్పా మిగిలిన‌వ‌న్నీ దేశంలోనే త‌యారు చేసిన‌ట్టు చెప్పారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇండియా నుంచి వ‌స్తువులు ర‌వాణా చేయ‌డానికి విదేశీ కంపెనీల‌కు ఏడాదికి రూ.6 ల‌క్ష‌ల కోట్లు చెల్లిస్తున్న‌ట్టు మోదీ చెప్పారు. ఇది దాదాపు మ‌న ర‌క్ష‌ణ బ‌డ్జెట్ కు స‌మానం అని పేర్కొన్నారు.

విదేశాల‌పై ఆధార‌ప‌డ‌ట‌మే అతిపెద్ద శ‌త్రువు : ప్రధాని - Tholi Paluku