Let's talk: editor@tmv.in
విద్యా విధానంలో సమూల మార్పులు: సీఎం నిర్ణయం

విద్యా విధానంలో సమూల మార్పులు: సీఎం నిర్ణయం

T Venkata Ramana
18 సెప్టెంబర్, 2025

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తెలంగాణ విద్యా విధానాన్ని రూపొందించడం, యువతకు నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ఆయన దృష్టి సారించారు. ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యా విధానం అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు గ్రాడ్యుయేట్ అవుతున్నప్పటికీ వారిలో కేవలం 15 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు పొందగలుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీనికి విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలే ప్రధాన కారణమని తెలిపారు.

పేదరిక నిర్మూలనకు విద్యే మార్గం

పేదరికాన్ని నిర్మూలించడానికి విద్య ఒక్కటే ఏకైక మార్గమని సీఎం అన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం ద్వారానే రాష్ట్రంలోని 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వగలమన్నారు. రాష్ట్రంలో 11 వేల ప్రైవేట్ పాఠశాలల్లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 18 లక్షల మంది మాత్రమే చదువుకుంటున్నారని తెలిపారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. తెలంగాణ తీసుకొచ్చే నూతన విద్యా విధానం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సమూల మార్పులు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఆర్థిక వనరుల సమీకరణ

విద్యా రంగానికి నిధుల కేటాయింపులో ఉన్న సమస్యలను కూడా సీఎం ప్రస్తావించారు. విద్యాశాఖకు కేటాయించిన రూ.21 వేల కోట్లలో 98 శాతం జీతాలకే ఖర్చు అవుతున్నందున విద్యారంగం అభివృద్ధికి తగిన నిధులు అందుబాటులో ఉండటం లేదన్నారు. విద్య కోసం తీసుకునే రుణాలకు ఫిజికల్ రెస్సాన్సిబులిటి బడ్జెట్ మేనేజ్ మెంట్ పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరినట్లు తెలిపారు.

నిపుణుల కమిటీ

విద్యా విధానంలో మార్పుల కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ కమిటీ ఆధునిక విద్యా విధానాలు, సిలబస్ మార్పులు, ఉపాధ్యాయ శిక్షణ, విద్యా రంగంలో సాంకేతికత వినియోగం వంటి అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందిస్తుంది. ఇంజినీరింగ్ విద్యార్థులకు కేవలం సైద్ధాంతిక జ్ఞానం కాకుండా, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల గ్రాడ్యుయేట్ అయిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. విద్యా విధానంలో తీసుకువచ్చే మార్పుల ద్వారా విద్యార్థులు తమ పాఠశాల, కళాశాల విద్య పూర్తయిన తర్వాత ఉద్యోగాలు పొందేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల నిరుద్యోగ సమస్య కొంతవరకు తగ్గుతుంది.

విద్యా విధానంలో సమూల మార్పులు: సీఎం నిర్ణయం - Tholi Paluku