Let's talk: editor@tmv.in
వృద్దురాలి మృతదేహానికి ప్రభుత్వం గౌరవ వందనం

వృద్దురాలి మృతదేహానికి ప్రభుత్వం గౌరవ వందనం

Pinjari Chand
26 సెప్టెంబర్, 2025

అక్కడ చనిపోయింది ఓ సాధారణ మనిషి. అందులోనూ 78 ఏళ్ల ఓ వృద్ధురాలు. పోలీసులు ఆమె మృతదేహానికి గౌరవ వందనం సమర్పిస్తున్నారు. అక్కడున్న వారందరూ అశ్చర్యపోయారు. ఆమె ఏదైనా గొప్ప పని చేసిందా? స్వాతంత్ర సమరయోధురాలా? అని ఆరా తీస్తే కాదని తేలింది. మరి ఎందుకు ప్రభుత్వం తరపున గౌరవవందనం సమర్పించారు. తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే..

మందసోర్​ జిల్లాలోని మేఘదూత్ నగర్​ నివాసి అయిన సోహన్ దేవి బుధవారం గుజరాత్‌లోని నాడియాద్‌లో చికిత్స పొందుతూ చనిపోయింది. గురువారం ఆమె మృతదేహాన్ని సుందర్​ లాల్​ పట్వా ప్రభుత్వ కళాశాలకు దానం చేశారు. ఆమె మరణాని కంటే ముందే ఆమె తను చనిపోతే మృతదేహాన్ని వైద్య విద్యార్థులకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమె మృతదేహానికి పోలీసులు ‘గార్డ్​ ఆఫ్​ హానర్​’ సమర్పించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యకళాశాల డీన్​ శశిగాంధీ మాట్లాడుతూ గత సంవత్సరం కూడా మందసౌర్​ నుంచి మూడు మృతదేహాలను దానం చేశారని, ఈ సంవత్సరం ఇదే మొదటిదని తెలిపారు. దానం చేసిన తరువాత మృతదేహానికి రసాయనాలు పూసి భద్రపరుస్తారని, ఎంబిబిఎస్​ చేసే విద్యార్థుల అధ్యయనానికి తదనంతరం ఉపయోగిస్తామన్నారు. వారు శరీర భాగంలోని కండరాలు, నరాలు, రక్త సరఫరా, వివిధ భాగాల గురించి నేర్చుకుంటారని, ఇది వారి క్లీనికల్ ప్రాక్టీస్ కు సహాయపడుతుందని వివరించారు. శరీర దానం అన్ని దానాల కంటే గొప్పదని, పౌరులందరూ ఆ దిశగా ఆలోచించాలని కోరారు.

శరీర దానాన్ని ప్రోత్సాహించడానికే

వైద్య అధ్యయనాలు చేయడానికి, పరిశోధనల కోసం మానవ మృతదేహాలు అవసరమవుతాయని, అందుకోసం ప్రభుత్వం ప్రజల్లో అవగాహన పెంచడానికి గార్డ్​ ఆఫ్ హనర్​ ను అమలు పరిచిందని కలెక్టర్​ అదితి గార్గ్​ తెలిపారు. శరీరాన్ని దానం చేసే కుటుంబాన్ని గౌరవించే ప్రక్రియలో భాగమే గౌరవ వందనమని వివరించారు. ఈ సందర్భంగా ఇతర పౌరులు కూడా ముందుకు రావాలని, శరీర దానానికి తోడ్పడాలని అభ్యర్థించారు.

నా మృతదేహాన్ని కూడా దానం చేస్తా

మరోవైపు, సదరు వృద్ధురాలి భర్త ఛగన్ లాల్ కాంక్రేచా మాట్లాడుతూ "ఈరోజు, నేను సుందర్‌ లాల్ పట్వా ప్రభుత్వ వైద్య కళాశాలలో నా భార్య సోహన్ దేవి కాంక్రేచా మృతదేహాన్ని దానం చేశాను ఇక్కడ మాకు లభించిన గౌరవానికి నేను కృతజ్ఞుడను. మరణానంతరం నా శరీరాన్ని కూడా దానం చేయాలని నిర్ణయించుకున్నాను. ప్రజలు కూడా మరణానంతరం తమ శరీరాన్ని దానం చేయడానికి ముందుకు రావాలని ఆకాంక్షించారు.

వృద్దురాలి మృతదేహానికి ప్రభుత్వం గౌరవ వందనం - Tholi Paluku