Let's talk: editor@tmv.in
వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ

వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ

Dantu Vijaya Lakshmi Prasanna
7 ఫిబ్రవరి, 2026

బ్యాంకింగ్ సేవలలో పారదర్శకతను పెంచడానికి కస్టమర్లను మోసాల నుండి రక్షించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం జరిగిన ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పలు కీలక ముసాయిదా మార్గదర్శకాలను ప్రతిపాదించారు.

రెపో రేటు యథాతథం: 5.25 శాతంగా ఖరారు

ఈ ఏడాది జరిగిన ఈ తొలి మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఆర్‌బీఐ ప్రస్తుతమున్న రెపో రేటును 5.25 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ద్రవ్య విధాన వైఖరిని కూడా 'న్యూట్రల్' (తటస్థం)గా ఉంచుతున్నట్లు గవర్నర్ స్పష్టం చేశారు.

ద్రవ్యోల్బణ పరిస్థితులు అదుపులో ఉన్నప్పటికీ, ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి దృష్ట్యా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదని గవర్నర్ వివరించారు. ఈ నిర్ణయంతో గృహ రుణ గ్రహీతల ఈఎమ్ఐ లలో తక్షణ మార్పు ఏమీ ఉండదు.

ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఆర్‌బీఐ పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. కేంద్ర బడ్జెట్‌లోని సానుకూల అంశాలు, జీఎస్టీ సంస్కరణలు, అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో దేశ అభివృద్ధి వేగం పుంజుకుంటుందని గవర్నర్ పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం (FY27) మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.9 శాతం గా, రెండో త్రైమాసికంలో 7 శాతం గా ఉండవచ్చని అంచనాలను సవరించారు. ప్రైవేట్ వినియోగం పెరగడం వల్ల ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందని కమిటీ అభిప్రాయపడింది.

ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 2.1 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. అయితే, FY27 ప్రథమార్థంలో ఇది 4 శాతం నుండి 4.2 శాతం మధ్య ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఆహార ధరల హెచ్చుతగ్గులు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపవచ్చని, అందుకే వడ్డీ రేట్లలో ప్రస్తుతానికి మార్పులు చేయలేదని వివరించారు.

చివరగా, దేశ విదేశీ మారక నిల్వలు 723.8 బిలియన్ డాలర్ల కు చేరి పటిష్టంగా ఉన్నాయని, తదుపరి ఎంపీసీ సమావేశం ఏప్రిల్ 6-8 తేదీల్లో జరుగుతుందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.

డిజిటల్ మోసాలకు రూ.25,000 పరిహారం

డిజిటల్ లావాదేవీల పట్ల కస్టమర్లలో భరోసా కల్పించేందుకు ఆర్బీఐ ఒక వినూత్న ప్రతిపాదన చేసింది. చిన్న మొత్తాల డిజిటల్ మోసాల బారిన పడి సొమ్ము కోల్పోయిన కస్టమర్లకు రూ.25,000 వరకు పరిహారం చెల్లించేలా కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురానున్నారు. దీనితో పాటు, సీనియర్ సిటిజన్ల భద్రత కోసం అదనపు అథెంటికేషన్ వంటి చర్యలను కూడా పరిశీలిస్తున్నారు.

మిస్-సెల్లింగ్, రికవరీ ఏజెంట్లపై ఉక్కుపాదం

బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు కస్టమర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి పథకాలను విక్రయించడాన్ని అరికట్టేందుకు కఠిన నిబంధనలు రానున్నాయి. అలాగే, రుణాల వసూలు పేరుతో రికవరీ ఏజెంట్లు కస్టమర్లను వేధించకుండా ఉండేలా కొత్త ప్రవర్తనా నియమావళిని సిద్ధం చేస్తున్నారు.

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాల పరిమితి పెంపు

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరటనిస్తూ, పూచీకత్తు లేని రుణాల పరిమితిని రూ.10 లక్షల నుండి రూ.20 లక్షలకు పెంచాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇది చిన్న వ్యాపారస్తులకు ఎంతో మేలు చేకూర్చనుంది.

సహకార బ్యాంకుల కోసం 'మిషన్ సాక్షమ్'

పట్టణ సహకార బ్యాంకులను బలోపేతం చేసేందుకు 'మిషన్ సాక్షమ్' పేరుతో భారీ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీని ద్వారా సుమారు 1.4 లక్షల మంది సిబ్బందికి అత్యాధునిక సాంకేతికత, నిర్వహణలో శిక్షణ ఇస్తారు.

రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్

దేశీయ రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లకు బ్యాంకులు నేరుగా రుణాలు ఇచ్చేందుకు అనుమతినిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం, బ్యాంకులు కేవలం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌ల కింద ఉండే కంపెనీలకు మాత్రమే రుణాలు ఇచ్చే వెసులుబాటు ఉండేది. ఈ కొత్త మార్పుతో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌ నేరుగా తక్కువ వడ్డీకే నిధులను సేకరించే అవకాశం లభించింది. ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తే, బ్యాంకింగ్ వినియోగదారులకు మరింత భద్రత లభించడంతో పాటు, రుణాల ప్రక్రియ సులభతరం కానుంది.

స్థిరత్వానికి ప్రాధాన్యత:

రేట్లను మార్చకపోవడం పట్ల 'క్రెడాయ్' వంటి సంస్థలు సానుకూలంగా స్పందించాయి. వడ్డీ రేట్లలో స్థిరత్వం ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు, డిమాండ్‌కు భరోసా లభిస్తుందని పేర్కొన్నాయి. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లో గృహ నిర్మాణ రంగం ఈ నిర్ణయంతో మరింత వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

పరిశ్రమ వర్గాల హర్షం:

ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై రియల్ ఎస్టేట్ దిగ్గజాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల నిధుల సేకరణ సులభతరం కావడమే కాకుండా, స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం లేకుండా స్థిరమైన బ్యాంక్ రుణాలు అందుతాయని సిబిఆర్ఈ ఇండియా సీఈఓ అన్షుమన్ మ్యాగజైన్ పేర్కొన్నారు. తక్కువ వడ్డీకే రుణాలు లభించడం వల్ల రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌ తమ నగదు ప్రవాహాన్ని మెరుగుపరుచుకోగలవని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ శిశిర్ బైజల్ అభిప్రాయపడ్డారు.

మిశ్రమంగా స్పందించిన అఫోర్డబుల్ హౌసింగ్ రంగం

అయితే, వడ్డీ రేట్లలో కోత ఉండవచ్చని ఆశించిన సాధారణ కొనుగోలుదారులకు ఈ నిర్ణయం కొంత నిరాశను మిగిల్చింది. అనరాక్ గ్రూప్ చైర్మన్ అనుజ్ పూరి మాట్లాడుతూ.. "వడ్డీ రేట్లు తగ్గించి ఉంటే ఇల్లు కొనాలని వేచి చూస్తున్న వారికి ఒక ప్రోత్సాహకంగా ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితి యథాతథంగా ఉంది" అని వ్యాఖ్యానించారు. రానున్న కాలంలో బ్యాంకులు తమ వద్ద ఉన్న నగదు నిల్వల ఆధారంగా వినియోగదారులకు రుణ ప్రయోజనాలను బదిలీ చేస్తాయని పరిశ్రమ ఆశిస్తోంది.

వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ - Tholi Paluku