
వడ్డీ రేట్లు తగ్గించిన యూఎస్ ఫెడ్
అందరూ ఊహించినట్టుగానే అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించింది. వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో వడ్డీ రేట్లు 4-4.25 శాతానికి పరిమితమయ్యాయి. ఇది 2024 డిసెంబర్ తర్వాత మొదటి వడ్డీ రేట్ల తగ్గింపు, అదే సమయంలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడియ్యాక మొదటి వడ్డీ రేట్ల తగ్గింపు. ట్రంప్ రెండోసారి పదవి చేపట్టాక చాలాసార్లు యూఎస్ ఫెడ్ పై వడ్డీ రేట్ల తగ్గింపునకు ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వడ్డీ రేట్ల తగ్గింపునకు ఒప్పుకోలేదు. ఇటీవలి కాలంలో అమెరికా ఉద్యోగాల డేటా బలహీనంగా ఉంది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితిలో జెరోమ్ పావెల్ వడ్డీ రేట్ల తగ్గింపునకు ఒప్పుకున్నారు. వడ్డీ రేట్ల తగ్గింపునకు అనుకూలంగా ఫెడరల్ ఒపెన్ మార్కెట్ కమిటీ సభ్యులు మెజార్టీగా ఓటు వేశారు. ఈ ఏడాదిలో మరో రెండుసార్లు వడ్డీ రేట్ల తగ్గింపునకు అవకాశం ఉందని ఫెడ్ సంకేతాలిచ్చింది.
ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో ఆర్థిక వృద్ధి మద్యస్థంగా ఉన్నట్టు వివిధ రకాల డేటా చెబుతోంది. బలహీన ఉద్యోగాల డేటా, ద్రవ్యోల్బణం కారణంగా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపునకు ముందుకొచ్చింది. 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్ల తగ్గింపును ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ `రిస్క్ మేనేజ్మెంట్ తగ్గింపు`గా అభివర్ణించారు. ఇటీవలి కాలంలో ఉద్యోగ డేటా బలహీనపడిందని, కొత్త ఉద్యోగాల సృష్టి బ్రేక్ ఈవెన్ రేటు కంటే తక్కువగా ఉన్నట్టు జెరోమ్ పావెల్ తెలిపారు. ట్రంప్ ఒత్తిడి నేపథ్యంలో వడ్డీ రేట్లు తగ్గించారా అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు జెరోమ్ పావెల్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తమకు అందుతున్న డేటా ఆధారంగా చర్యలు తీసుకోవడం తమ కల్చర్ లో ఉందని, ఎలాంటి ఇతర అంశాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆర్థిక వృద్ధిపై ఉన్న ఆందోళన కన్నా బలహీన ఉద్యోగాల డేటాపై ఉన్న ఆందోళన ఫెడ్ రేట్ల తగ్గింపులో స్పష్టంగా కనిపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్ల కోతతో అమెరికా స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఇండియన్ మార్కెట్లు కొంత పాజిటివ్ గా ఉన్నాయి. ఎందుకంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే ఇండియాన్ మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి.
