
వడగాలుల ముప్పు.. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోండి: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో భానుడి భగభగలు మొదలవుతున్న నేపథ్యంలో ఎండ తీవ్రత, వడగాల్పుల వల్ల మనుషులు, పశువులకు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఈ ఏడాది 'జీరో హ్యూమన్, యానిమల్ లాస్' (సున్నా ప్రాణనష్టం) దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మంగళవారం తాడేపల్లిలోని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో వేసవి సంసిద్ధతపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ‘హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ - 2026’ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.
పనివేళల్లో మార్పులు.. ప్రత్యేక జాగ్రత్తలు
తీవ్రమైన ఎండలు ఉండే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో ఎటువంటి పనులు చేయకుండా పనివేళలను రీషెడ్యూల్ చేయాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, వృద్ధులు, చిన్నారుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వడదెబ్బ బారిన పడే వారి కోసం ఆసుపత్రులలో ప్రత్యేక బెడ్లు, అవసరమైన మందులు,అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు.
మరోవైపు ప్రజలు ఎక్కువగా తిరిగే బస్టాండ్లు, మార్కెట్లు, ప్రధాన కూడళ్లు, పర్యాటక ప్రాంతాల్లో తప్పనిసరిగా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ గ్రూపుల సహకారంతో మజ్జిగ, తాగునీరు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా వేసవి సెలవుల్లో పిల్లలు చెరువులు, కుంటల వద్దకు వెళ్లకుండా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అగ్నిప్రమాదాల నివారణకు హాస్పిటల్స్, హోటళ్లలో ఫైర్ సేఫ్టీ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
పశుగ్రాసం, నీటి సరఫరాపై నిఘా
ఎండల వల్ల మూగజీవాలు మృత్యువాత పడకుండా గ్రామాల్లోని నీటి తొట్టెలను ట్యాంకర్లతో నిరంతరం నింపాలని మంత్రి సూచించారు. పశుగ్రాసం కొరత లేకుండా రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని పశుసంవర్ధక శాఖను ఆదేశించారు. గృహ అవసరాలకు విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు స్పష్టం చేశారు.
రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు
విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ ఈ ఏడాది మధ్య ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. గత వేసవి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. ఎండ తీవ్రత సమాచారం కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్డీఆర్ఎఫ్ ఐజీపీ రాజకుమారి, ఫైర్ డిపార్టమెంట్ అడిషనల్ డైరెక్టర్ జ్ఞానసుందర్ మరియు వివిధ జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా పాల్గొన్నారు.
