
వడగళ్ల వానతో పంటనష్టం..కేంద్రం సమీక్ష
దేశంలోని పలుచోట్ల కురిసిన భారీ వర్షాలు, వడగళ్ల వానల కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ ఆదివారం సమీక్షించారు. ప్రభావిత రాష్ట్రాల్లో పంటనష్టంపై సమగ్ర నివేదిక సేకరించాలని, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసి క్షేత్ర స్థాయి సమాచారం తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి నష్టంపై వివరాలు సేకరించాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులకు మంత్రి సూచించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. పంటలకు జరిగిన నష్టంపై ప్రభావిత రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో కూడా ఆయన చర్చించనున్నారు. ఈ సమయంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.
రేపటి నుంచి వర్ష సూచనలు
ఇదిలా ఉండగా భారత వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం ఏప్రిల్ 7 నుంచి ఉత్తర–పశ్చిమ భారతదేశాన్ని మరో తాజా వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ప్రభావితం చేయనుంది. దీనివల్ల జమ్మూ–కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఏప్రిల్ 10 వరకు విస్తృతంగా వర్షాలు, మెరుపులు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. ఏప్రిల్ 7–8 తేదీల్లో జమ్మూ–కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగళ్ల వానలు పడే అవకాశం ఉంది. అలాగే తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా ప్రాంతాల్లో కూడా వడగళ్ల వానలు కురిసే సూచనలు ఉన్నాయి. బీహార్, ఝార్ఖండ్, గంగానది పరివాహక పశ్చిమబెంగాల్ ప్రాంతాలు కూడా ఏప్రిల్ 8 వరకు వడగళ్ల వాన ప్రభావంలో ఉండనున్నాయి.
దక్షిణ భారతంలో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో ఏప్రిల్ 6 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా అంతర్గత కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో వారం మొత్తం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వాతావరణ మార్పుల ప్రభావంతో ఉత్తర–పశ్చిమ భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఏప్రిల్ 7 నుంచి 10 మధ్య 3–5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉంది. తూర్పు భారతదేశంలో కూడా ఏప్రిల్ 5 నుంచి 8 మధ్య 3–4 డిగ్రీల వరకు తగ్గవచ్చని అంచనా.
రైతులకు సూచనలు
• వ్యవసాయ వాతావరణ సలహాల ప్రకారం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో రైతులు తోటలు, కూరగాయల పంటలపై వడగళ్ల నుంచి రక్షణకు వలలు ఏర్పాటు చేయాలని సూచించారు. పండిన పంటలను ఆలస్యం చేయకుండా కోత కోయాలని కూడా సూచించారు.
• జమ్మూ–కశ్మీర్‌లో కోత కోసిన ఆవాలు, మినుములు, శనగలను సురక్షితంగా నిల్వ చేయాలని, నిల్వ నీటిని పొలాల నుంచి తొలగించాలని రైతులకు సూచించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో జూమ్ వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు వేయడాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని తెలిపారు.
• కేరళలో అరటి చెట్లకు సపోర్ట్ ఏర్పాటు చేయాలని, తమిళనాడులో భారీ వర్షాల సమయంలో పురుగుమందులు పిచికారీ చేయవద్దని సూచించారు. కోసిన పంటలను టార్పాలిన్‌తో కప్పి లేదా గదుల్లో నిల్వ చేయాలని రైతులకు సూచించారు.
• అలాగే పశువులకు వడగళ్ల వాన సమయంలో ఆశ్రయం కల్పించాలని, మేతను పొడి ప్రదేశాల్లో నిల్వ చేయాలని సూచించారు. చేపల చెరువుల యజమానులు నీరు పొంగిపోకుండా వలలుఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు.
