
వట్టేపల్లిలో ఏఐఎంఐఎం కార్యకర్త దారుణ హత్య
హైదరాబాద్‌లోని వట్టేపల్లిలో ఏఐఎంఐఎం కార్యకర్త మహబూబ్ అలీ (50)ను ఓ గ్యాంగ్ కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేసింది. ఆదివారం రాత్రి ఆయన నివాసానికి దగ్గరలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఐదుగురు వ్యక్తులు మహబూబ్ అలీపై కత్తులతో దాడి చేశారు. మృతుడి బంధువుల్లో ఒకరు ఈ దాడి కోసం వారిని పురమాయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్యకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన మహబూబ్ అలీని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
మహబూబ్ అలీ కుటుంబ సభ్యులను ఏఐఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ పరామర్శించి సంతాపం తెలిపారు. అనంతరం ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు.
వట్టేపల్లిలో మహబూబ్ అలీపై గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేసి హత్య చేయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ముబీన్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ పోలీసులు పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేయాలని, సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపాలని కోరారు. డ్రగ్స్, హింసాత్మక నేరాలపై కఠిన చర్యలు తీసుకుని ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
