
విజయ్కి ఎంపీ కనిమొళి చురకలు
రాజకీయాల్లోకి కొత్తగా వచ్చే వారందరూ డీఎంకేను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారని ఎంపీ కనిమొళి అన్నారు. కొత్తగా వచ్చే వారు తాము గెలిస్తే ప్రజలకు చేయబోయే పనుల గురించి, అమలు చేసే సంక్షేమ పథకాల గురించి వివరించకుండా డీఎంకేను తిట్టడమే పనిగా పెట్టుకుంటే ప్రజలు ఆదరించరని అన్నారు. డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై జయంతి సందర్భంగా రౌండ్ ఠాణా జంక్షన్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కనిమొళి మాట్లాడుతూ రాజకీయ ప్రవేశం చేసే వారు డీఎంకేను విమర్శిస్తేనే గుర్తింపు లభిస్తుందని భావించడం వారి ఆవివేకమని, డీఎంకేకు సుమారు ఏడు దశాబ్దాల చరిత్ర ఉందని గుర్తు చేశారు. డీఎంకే ప్రజలతో మమేకమైందని అలాంటి పార్టీని నొటికొచ్చినట్లు దూషించడం సరికాదని హెచ్చరించారు.
ఈ కౌంటర్ విజయ్ కేనా
ఎంపీ కనిమొళి మాట్లాడిన మాటలు టీవీకే విజయ్ కేనని రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు. తాజాగా విజయ్ తిరుచ్చి నుంచి బస్సు యాత్ర ప్రారంభించి డీఎంకే విమర్శానాస్త్రాలు ఎక్కుపెట్టారు. వాటికి కౌంటర్ గానే ఎంపీ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. గతంలోనూ విజయ్ పై కనిమొళి విమర్శలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తేడా తెలియకుండా, ఎక్కడి నుంచో వచ్చి రాజకీయాలు చేస్తున్నారని విజయ్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.పరిపాలనపై అనుభవం లేకుండానే వాగ్ధానాలు చేస్తున్నారని, ముందు రాజకీయాలను అవగాహన చేసుకోవాలని హితవు పలికారు.
