
వచ్చే సీజన్ నాటికి మార్కెట్ యార్డులో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తాం: ఎమ్మెల్యే సురేంద్రబాబు
రైతులు, వ్యాపారులకు మరింత సౌకర్యాలు కల్పించే దిశగా కళ్యాణదుర్గం వ్యవసాయ మార్కెట్ యార్డులో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. వచ్చే చింతపండు సీజన్ నాటికి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసి రైతులు, వ్యాపారులు తమ ఉత్పత్తులను నిల్వ ఉంచుకునేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం కళ్యాణదుర్గం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జరుగుతున్న చింతపండు క్రయవిక్రయాలను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పరిశీలించారు. మార్కెట్ యార్డు చైర్మన్ గోళ్ళ లక్ష్మీదేవి రమేష్, స్థానిక నాయకులు, వ్యాపారులతో కలిసి మార్కెట్ పరిస్థితులను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా చింతపండు రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రస్తుతం మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి రైతులకు గిట్టుబాటు అవుతున్నాయో లేదో అదేవిదంగా కూలీ, రవాణా ఖర్చులు ఎంతవరకు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.
అదేవిదంగా మార్కెట్‌లోని దుకాణాలను సందర్శించి మార్కెట్‌కు ఎంత పరిమాణంలో చింతపండు వస్తుంది దాని నాణ్యత ఎలా ఉంటుంది అని వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. కాగా మూడు నెలల పాటు మంచి ధరలు రావాలంటే చింతపండు రంగు మారకుండా నిల్వ ఉంచేందుకు కోల్డ్ స్టోరేజ్ అవసరమని వ్యాపారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు సంబంధించిన ఫైల్ ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉందని వచ్చే సీజన్‌కు ముందే ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే కూరగాయల మార్కెట్‌ను సందర్శించి వ్యాపారులతో మాట్లాడారు. రైతులు, వ్యాపారులు, ప్రజలకు అనుకూలంగా అన్ని సౌకర్యాలతో కూడిన ఆధునిక కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. మార్కెట్ యార్డులో మరిన్ని మౌలిక వసతులు కల్పించి వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
