
వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సంస్కరణలు చేపడతాం: సీఎం
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను పెంపొందించడం, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
2026 విద్యా సంవత్సరం నుండి పోషకాహార కార్యక్రమం
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుండి పాలు, బ్రేక్‌ఫాస్ట్ (అల్పాహారం), మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమగ్ర పోషకాహార కార్యక్రమం 2026 విద్యా సంవత్సరం జూన్ నుండి అమలు జరిగే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
వసతుల కల్పన, పాఠశాలల పటిష్టత
ప్రభుత్వ పాఠశాలల్లో మరింత మెరుగైన వసతులు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూళ్లకన్నా మెరుగ్గా ఉండాలని ఆకాంక్షించారు. ఈ దిశగా ఆట స్థలం, అవసరమైన తరగతి గదులు, మంచి వాతావరణం వంటి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని సూచించారు.
తొలి దశలో కోర్ అర్బన్ ప్రాంతంపై దృష్టి
మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా తొలి దశలో ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం విద్యా శాఖ పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించాలని అధికారులకు సూచించారు. సరిపడా సౌకర్యాలు లేని పాఠశాలలను సమీపంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలకు తరలించాలని ఆదేశించారు.
పైలట్ ప్రాజెక్టుగా నూతన పాఠశాలలు
నూతన విద్యా విధానంలో భాగంగా ముఖ్యమంత్రి మరో ముఖ్యమైన నిర్ణయాన్ని వెల్లడించారు. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు కొత్త పాఠశాలలను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ఆదేశించారు. ఈ కొత్త పాఠశాలల్లో కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అన్ని వసతులతో విద్యను అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
అమ్మ బడి పథకం ద్వారా కల్పించిన ముఖ్య సౌకర్యాలు
అమ్మ బడి పథకం ప్రథమ దశలో 9,123 పాఠశాలల్లో ప్రారంభమైంది. మొత్తం 7,289 కోట్లు వ్యయంతో మూడు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను కవర చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ ప్రాజెక్ట్ అమలుకు ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ విభాగం బాధ్యత వహిస్తోంది.అమ్మ బడి పథకం ద్వారా పాత పాఠశాల భవనాలను పునరుద్ధరించి, అవసరమైన చోట కొత్త తరగతి గదులు నిర్మించారు. బెంచీలు, డెస్కులు, బ్లాక్‌బోర్డులు, ఫ్యాన్లు, లైట్లు, మరియు ల్యాబ్ సామగ్రిని అందించారు.పాఠశాల ప్రాంగణం చుట్టూ గోడలు నిర్మించి, భద్రత కోసం గేట్లు ఏర్పాటు చేశారు.
ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాలల సంఖ్య 43,154గా ఉంది. ఈ పాఠశాలల్లో మొత్తం 7,45,7851 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ వివరాలు 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించిన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ తాజా గణాంకాల్లో వెల్లడయ్యాయి.
పాఠశాలల ప్రాథమిక వసతుల పరంగా పరిశీలిస్తే, ఎక్కువ శాతం విద్యాసంస్థల్లో టాయిలెట్లు ఉన్నప్పటికీ, వాటిలో కొన్నింటి వినియోగ స్థితి సరిగా లేని విషయం రిపోర్ట్‌లో సూచించబడింది. సుమారు 1,700 నుండి 2,300 ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మాయిల కోసం ప్రత్యేక టాయిలెట్లు అందుబాటులో లేదు. కొంతమంది పాఠశాలల్లో నీటి సరఫరా శుభ్రత కొరత వల్ల టాయిలెట్లు వినియోగయోగ్యంగా లేవని నివేదికలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బకాయిలను చెల్లించేందుకు రూ.54 కోట్లు విడుదల చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
