
వచ్చే ఆరు నెలల్లో 10 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లు: సీఎం చంద్రబాబు
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో గృహ వంటగ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఎల్‌ఎన్‌జీ దిగుమతుల్లో తలెత్తుతున్న ఆటంకాలను అధిగమించేందుకు, పైప్‌డ్ నేచురల్ గ్యాస్ వినియోగాన్ని యుద్ధప్రాతిపదికన పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో గృహ గ్యాస్ సరఫరాపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఆరు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల కొత్త పీఎన్‌జీ కనెక్షన్లు అందించాలని అధికారులకు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు.
సబ్సిడీలపై స్పష్టత.. 'దీపం' లబ్ధిదారులకు భరోసా
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'దీపం' పథకం లబ్ధిదారులు పీఎన్‌జీ కనెక్షన్ల వైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల రూపంలో అందుతున్న ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల సబ్సిడీ, పీఎన్‌జీకి మారినప్పటికీ యథాతథంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. "లబ్ధిదారుల్లో ఎలాంటి అపోహలు ఉండకూడదు. సిలిండర్ వాడినా, పైప్‌లైన్ గ్యాస్ వాడినా ప్రభుత్వం ఇచ్చే రాయితీ వారికి అందుతుంది" అని పేర్కొంటూ, దీనిపై తక్షణమే అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడటం తగ్గించి, స్వదేశీ గ్యాస్ గ్రిడ్ వినియోగాన్ని పెంచడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని సీఎం వివరించారు.
కేంద్ర మంత్రితో చర్చ.. ప్రాజెక్టుల వేగవంతం
శ్రీకాకుళం–కాకినాడ సహజ వాయు పైప్‌లైన్ ప్రాజెక్టులో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పురోగతిని సమీక్షించిన ఆయన, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంటనే కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో ఫోన్‌లో సంభాషించారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, అనుమతులను వేగవంతం చేసి పనులను పట్టాలెక్కించాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
త్వరలో సాధారణ స్థితికి గ్యాస్ సరఫరా
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న గృహ గ్యాస్ కొరతపై కూడా సీఎం అధికారులను ఆరా తీశారు. అంతర్జాతీయ అనిశ్చితి వల్ల సరఫరా గొలుసులో కొంత తడబాటు ఏర్పడిందని అయితే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. రానున్న కొద్ది రోజుల్లోనే గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని వారు వివరించారు. చమురు సంస్థలు సమన్వయంతో పనిచేసి వినియోగదారులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, చమురు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు
