Let's talk: editor@tmv.in
వచ్చేది మన ప్రభుత్వమే.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఫైర్
వచ్చేది మన ప్రభుత్వమే.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఫైర్

వచ్చేది మన ప్రభుత్వమే.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఫైర్

Gaddamidi Naveen
12 ఏప్రిల్, 2026

మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, రేవంత్ రెడ్డి తన అహంకారంతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ, తన కుటుంబ సభ్యులు, అనుచరుల ప్రయోజనాల కోసం పేదల భూములను అన్యాయంగా స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ, ఆయ‌న తెలంగాణ చరిత్రలో ఒక చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని విమర్శించారు.

ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అక్రమాలను తట్టుకుని బీఆర్ఎస్ జెండా ఎగరడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మెజారిటీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ వైపు ఉన్నా, అక్రమంగా పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ చూసిందని, కానీ చివరకు న్యాయమే గెలిచిందని ఆయన అన్నారు.

ఫోర్త్ సిటీ పేరుతో భూముల దందా

ఫార్మా సిటీ, ఫోర్త్ సిటీ అంశాలపై కూడా కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు రైతులకు భూములు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు అదే భూముల్లో ఫోర్త్ సిటీ పేరుతో కొత్త ప్రాజెక్ట్ అంటూ మోసం చేస్తోందని ఆరోపించారు. కోర్టులో ఫార్మా సిటీ ఉందని చెబుతూ, బయటకు వచ్చి ఫోర్త్ సిటీ కడతామని చెప్పడం విరుద్ధ వైఖరి అని విమర్శించారు. మరో 16,000 ఎకరాల భూమిని రైతుల నుంచి తీసుకునే ప్రయత్నం జరుగుతోందని, ఇది కేవలం కుటుంబ సభ్యులు, అనుచరులకు లాభం చేకూర్చడానికే చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న నగర సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం, భవిష్యత్ నగరాల పేరుతో ప్రజలను మభ్యపెడుతోందని కేటీఆర్ విమర్శించారు. నగరంలో దోమల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం, ఫ్యూచర్ సిటీ నిర్మాణం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. కోహెడలోని 178 ఎకరాల పండ్ల మార్కెట్ స్థలాన్ని అమ్ముకునేందుకే దానిని రాచకొండ గుట్టల వైపు తరలించాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు.

నిషేధిత భూములు - బ్లాక్ మెయిల్ రాజకీయాలు

నిషేధిత భూముల జాబితాపై కూడా కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో గతంలో 16 లక్షలుగా ఉన్న నిషేధిత భూముల సంఖ్యను కాంగ్రెస్ ప్రభుత్వం కోటి ఎకరాలకు పెంచిందని కేటీఆర్ మండిపడ్డారు. సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు నిషేధిత భూముల పరిధిని విస్తరించి ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తోందని విమర్శించారు. రెవెన్యూ శాఖ అధికారులు, మంత్రులు కలెక్టర్లపై ఒత్తిడి తీసుకొచ్చి భూముల సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

స్థానిక ఎమ్మెల్యేల అవినీతి, అక్రమ వసూళ్లపై కూడా కేటీఆర్ ప్రస్తావించారు. హోటళ్లు, బార్లు, క్రషర్ల నుంచి నెలవారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ, ఇలాంటి అరాచకాలకు త్వరలో ముగింపు వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు లొంగి అక్రమాలకు పాల్పడే అధికారులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని కేటీఆర్ హెచ్చరించారు. వచ్చేది మన ప్రభుత్వమే.. అక్రమాలకు పాల్పడిన ప్రతి అధికారిని గుర్తుంచుకొని మరీ శిక్షిస్తాం అని స్పష్టం చేశారు. అధికారులు ప్రజల కోసం పనిచేయాలే తప్ప రాజకీయ ఒత్తిళ్లకు లొంగకూడదని సూచించారు.

కష్టకాలాన్ని ఎదుర్కొన్న పార్టీ త్వరలో మళ్లీ బలపడుతుందని, రాష్ట్రంలో మంచి రోజులు వస్తాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, అప్పటి వరకు ప్రజల కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.