
వక్ఫ్ భూముల వివరాలన్నీ ఆన్‌లైనో : మంత్రి అజారుద్దీన్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ భూముల రక్షణ కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ వెల్లడించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తోందని తెలిపారు.
రాష్ట్రంలోని వక్ఫ్ భూముల వివరాలను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ తెలిపారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, పారదర్శకత పెంపు లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 63,180 ఎకరాల వక్ఫ్ ఆస్తులు ఉన్నాయని, అయితే వాటిలో సుమారు 46,000 ఎకరాల భూముల వివరాలు ఇప్పటివరకు అధికారిక పోర్టల్‌లో నమోదు కాలేదని మంత్రి వెల్లడించారు. కేవలం 17,000 ఎకరాలకు పైగా భూముల వివరాలు మాత్రమే ప్రస్తుతం ఆన్‌లైన్ రికార్డుల్లో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. వక్ఫ్ ఆస్తుల వివరాలను ఉమీద్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడానికి అదనంగా 3 నెలల సమయాన్ని కేటాయించడంతో పాటు, పోర్టల్‌ను తక్షణమే పునఃప్రారంభించాలని మంత్రి కోరారు.
వక్ఫ్ ఆస్తుల వివరాలన్నింటినీ తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు వేగవంతం చేశామని చెప్పారు.పెండింగ్‌లో ఉన్న వక్ఫ్ ఆస్తుల వివరాలను దశలవారీగా డిజిటల్ రికార్డులుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు. భూముల స్థానం, విస్తీర్ణం, వినియోగం, ప్రస్తుత స్థితి వంటి అన్ని అంశాలను సమగ్రంగా నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఆన్‌లైన్ వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత వక్ఫ్ ఆస్తులపై అక్రమ ఆక్రమణలను అరికట్టడం, వివాదాలకు పరిష్కారం చూపడం సులభమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోని వక్ఫ్ భూముల డేటాబేస్‌ను పూర్తిస్థాయిలో ఆధునీకరించడం ద్వారా భవిష్యత్తులో ఈ ఆస్తుల వినియోగం మరింత క్రమబద్ధం అవుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
వక్ఫ్ బోర్డు, రెవెన్యూ శాఖ, స్థానిక సంస్థల సమన్వయంతో ఈ డేటా సేకరణ జరుగుతుందని తెలిపారు. అలాగే, ప్రజలకు కూడా ఈ వివరాలను వీక్షించే అవకాశం కల్పించి, పారదర్శకతను పెంచుతామని అన్నారు. వక్ఫ్ ఆస్తులు మైనార్టీ సంక్షేమానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి అజారుద్దీన్ తెలిపారు. ఆన్‌లైన్ నమోదు పూర్తయిన తర్వాత వక్ఫ్ భూముల అభివృద్ధి, ఆదాయం పెంపు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఇది దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
