Let's talk: editor@tmv.in
వందే మాతరం డిబేట్‌పై అబద్ధాలు బట్టబయలయ్యాయి: కాంగ్రెస్

వందే మాతరం డిబేట్‌పై అబద్ధాలు బట్టబయలయ్యాయి: కాంగ్రెస్

Pinjari Chand
12 డిసెంబర్, 2025

వందేమాతరం 150 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా లోక్‌సభ, రాజ్యసభల్లో జరిగిన చర్చల తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన బృందం చెప్సిన అబద్ధాలు బట్టబయలయ్యాయి అని కాంగ్రెస్ గురువారం ఘాటుగా విమర్శించింది. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జైరాం రమేష్ ఒక పోస్ట్‌లో రెండు సభలు ఈ వారం వందే మాతరం పై చర్చించాయని, జాతీయ గేయం కూడా పలువురు సభ్యుల ప్రసంగాల్లో ప్రస్తావనకు వచ్చిందని చెప్పారు.

మోడీ, ఆయన అనుచరులు రుద్రాంగ్షు ముఖర్జీ రచించిన ‘ సాంగ్ ఆఫ్ ఇండియా: ఏ స్టడీ ఆఫ్ ది నేషనల్ అనెథం’, సభ్యసాచి భట్టాచార్య రాసిన ‘వందేమాతరం’ వంటి అధికారిక, చారిత్రక గ్రంథాలు చదవలేదని ఆయన విమర్శించారు. ఇవాళ్టి చర్చల తర్వాత కూడా వీరు ఈ పుస్తకాలు చదివే అవకాశం లేదు. అబద్ధాలు పూర్తిగా బయటపడ్డాయని రమేష్ అన్నారు.

ఇంకో పోస్ట్‌లో ఆయన 1937 నుంచి 1939 మధ్య రాజేంద్ర ప్రసాద్, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ, ఠాగూర్, గాంధీ మొదలైన నేతలు రాసిన 12 చారిత్రక లేఖలు, వాటి సంకలనాన్ని షేర్ చేశారు. ఇవి వందే మాతరం‌పై వారి అభిప్రాయాలను లిఖితపూర్వకంగా ఉంచిన పత్రాలు అని తెలిపారు.

చరిత్ర కారుడు సుగత బోస్ వ్యాఖ్యలను కూడా రమేష్ ప్రస్తావించారు. 1937లో ఠాగూర్ సలహాపైనే కాంగ్రెస్ వందేమాతరం మొదటి రెండు స్థాయిలను మాత్రమే జాతీయ కార్యక్రమాల్లో పాడాలని నిర్ణయించుకున్నదని చెప్పారు. దీనివల్ల మోడీ చేసిన ఆరోపణలు మరింత తప్పు అని ఆయన అన్నారు. సోమవారం లోక్‌సభలో, మంగళవారం నుంచి గురువారం వరకు రాజ్యసభలో వందే మాతరం 150 సంవత్సరాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం–విపక్షం మధ్య జాతీయత, చరిత్రా వ్యాఖ్యానాలపై వాగ్వాదాలు చెలరేగాయి. మరోవైపు మోడీ సోమవారం కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మహ్మద్ అలీ జిన్నా అభ్యంతరాల కారణంగా నెహ్రూ వందే మాతరాన్ని విభజించారని ఆయన తప్పు రాజకీయాలకు మార్గం సుగమం చేశారని ఆరోపించారు. ఈ చర్చ మొత్తంలో బీజేపీ చరిత్రను వక్రీకరించిందని, కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

రక్షణమంత్రి కి మనీబెన్ పటేల్ డైరీ పేజీలు అందజేత

సంసద్ భవన్‌లో గురువారం ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్‌కు కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ స్వయంగా వెళ్లి మనీబెన్ పటేల్ డైరీలోని కొన్ని పేజీల ప్రతులను అందించారు.

పత్రాలు ఇస్తూ గుజరాతీ భాషలో ఉన్న మనీబెన్ పటేల్(సర్దార్ వల్లభాయ్ పటేల్ కుమార్తె) డైరీ ఈ పేజీలను తప్పకుండా చదవండి. మీరు నెహ్రూ గురించి చెప్పిన మాటలు… ఇందులో ఎక్కడా లేవు. దీంతో రాజనాథ్ సింగ్ ఇటీవల నెహ్రూ గురించి చేసిన వ్యాఖ్యలు చారిత్రక పత్రాలతో సరిపోలవని, అవి వాస్తవానికి విరుద్ధమని జైరామ్ రమేష్ ప్రస్తావించినట్లైంది.

వందే మాతరం డిబేట్‌పై అబద్ధాలు బట్టబయలయ్యాయి: కాంగ్రెస్ - Tholi Paluku