Let's talk: editor@tmv.in
వందే భారత్‌లో పెరుగు ప్యాకెట్‌లో పురుగులు.. రూ.50 లక్షల జరిమానా

వందే భారత్‌లో పెరుగు ప్యాకెట్‌లో పురుగులు.. రూ.50 లక్షల జరిమానా

Pinjari Chand
27 మార్చి, 2026

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడికి అందించిన ప్యాకేజ్డ్ పెరుగు లోపల బతికిన పురుగులు కనిపించిన ఘటనపై రైల్వే శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలో సంబంధిత ఆహార సరఫరాదారు సంస్థ కాంట్రాక్టును రద్దు చేయడమే కాకుండా, రూ.50 లక్షల భారీ జరిమానా విధించింది. ఈ ఘటన ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పోరేషన్‌ నిర్వహిస్తున్న క్యాటరింగ్ సేవలలో చోటుచేసుకుంది. సేవల్లో లోపాలు ఉన్నందుకు ఐఆర్‌‌సీటీసీ పైనా రైల్వే మంత్రిత్వ శాఖ రూ.10 లక్షల జరిమానా విధించింది.

మార్చి 15న పాట్నా–టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రయాణికులకు భోజనంతో పాటు ప్రసిద్ధ బ్రాండ్‌కు చెందిన ప్యాకేజ్డ్ పెరుగు అందించారు. అయితే ఒక ప్యాకెట్ తెరిచినప్పుడు అందులో బతికిన పురుగులు, పురుగులాంటి కీటకాలు కనిపించాయి. దీనిపై ప్రయాణికుడు రితేష్ సింగ్ వెంటనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ఐఆర్‌‌సీటీసీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ని ట్యాగ్ చేశారు. ఘటనపై ఐఆర్‌‌సీటీసీ సమర్పించిన నివేదిక ప్రకారం, ఆ పెరుగు ప్యాకెట్‌ను పాట్నాలో ఎక్కించారు. తయారీ తేదీ మార్చి 9, 2026 కాగా గడువు తేదీ ఏప్రిల్ 7, 2026గా ఉంది. ఘటన తర్వాత అధికారులు ప్రయాణికులకు క్షమాపణలు చెప్పి డ్రై ఫ్రూట్స్, స్వీట్లు అందించారు.

మొదటగా సరఫరాదారు సంస్థ ‘కృష్ణ ఎంటర్‌ప్రైజెస్’పై రూ.25,000 జరిమానా విధించి హెచ్చరించిన ఐఆర్‌‌సీటీసీ చర్యలతో అసంతృప్తి చెందిన రైల్వే శాఖ, మరింత కఠినంగా వ్యవహరించింది. కాంట్రాక్టును పూర్తిగా రద్దు చేయాలని ఆదేశిస్తూ, జరిమానాను రూ.50 లక్షలకు పెంచింది. అలాగే ఐఆర్‌‌సీటీసీపై రూ.10 లక్షల జరిమానా విధిస్తూ, భవిష్యత్తులో ఆన్‌బోర్డ్ సేవలను కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని సూచించింది. ఆహార నాణ్యత, భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ ఘటనపై స్పందిస్తూ, ప్రయాణికుల భద్రత, సేవల నాణ్యత తమకు అత్యంత ప్రాధాన్యమని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.