
వందేమాతర గీతం వరసమారుతోంది ..
సుజలాం ,సుఫలాం మలయజ శీతలాం, సస్యశ్యామలం మాతరం.. అంటూ బ౦కించంద్ర చటర్జీ రాసిన గీతం ఈ తరానికి సరిపోతుందా.. 150 సంవత్సరాలు అయ్యింది ఈ గీతం ప్రజల్లోకి వచ్చి మరి నేటితరానికి అంతటి దేశభక్తి ఉందా.. వందేమాతరం - నేటి తరానికి సార్థకమా?
భారత స్వాతంత్ర సమరంలో “వందేమాతరం” అన్న పదం ఒక నినాదం కాదు. అది ఒక ఊపిరి, ఒక ఉరుము. 1905 బెంగాల్ విభజన కాలంలో బంకి౦ చంద్ర చటర్జీ రాసిన ఈ గీతం, దేశభక్తితో ప్రజల్లో అగ్ని రగిలించినది. “మాతృభూమి”ని దైవంగా భావించిన ఆ భావన లక్షల మందిని స్వాతంత్ర సమరానికి ప్రేరేపించింది. కాని ప్రశ్న ఏమిటంటే ఈ వందేమాతరం నినాదం నేటి తరానికి ఇంకా ప్రాముఖ్యత కలిగినదిగా ఉందా? లేక అది కేవలం పుస్తకాలలో, స్మారక సభల్లో మిగిలిపోయిందా?
ఒక చారిత్రక స్పూర్తి
“వందే మాతరం” అనే రెండు పదాలు అప్పట్లో బానిసత్వం మీద తిరుగుబాటు పిలుపుగా మారాయి. బాలగంగాధర తిలక్, లాలా లజపత్‌రాయ్, బిపిన్‌చంద్ర పాల్, అనంతరం మహాత్మా గాంధీ వంటి నాయకులు ఈ గీతం ద్వారా ప్రజల్లో దేశభక్తి నింపారు. బంకి౦ చంద్ర చటర్జీ రాసిన “ఆనందమఠం”నవలలో ఈ గీతం ఒక ఆధ్యాత్మిక స్వరూపం పొందింది.
కాని కాలం మారింది. స్వాతంత్ర౦ వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయాయి. నేటి యువతరం జాతీయ చైతన్యం కంటే ప్రపంచ పౌరత్వం, టెక్నాలజీ, ఉద్యోగ అవకాశాలు, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలను ప్రాధాన్యంగా చూస్తోంది. ఈ నేపథ్యంలో వందేమాతరం ఆలోచన ఎక్కడ నిలుస్తుంది?
నేటి తరానికి వందేమాతరం అర్థం ఏమిటో తెలుసా ?
ఇప్పటి తరం దేశభక్తిని విభిన్నంగా వ్యక్తం చేస్తోంది. సినిమా పాటల్లో, స్పోర్ట్స్ మైదానాల్లో, సోషల్ మీడియా పోస్ట్‌లలో “జై హింద్” లేదా “భారత్ మాతాకీ జై ”అనడం ఒక భావోద్వేగం. కానీ ఆ భావోద్వేగం వెనుక ఉన్న తాత్త్వికతను “మాతృభూమి అంటే కేవలం భూభాగం కాదు, మనిషి విలువలు, సంస్కృతి, నిస్వార్థత” అనేది ఎంత మంది అర్థం చేసుకుంటున్నారు?
ఇంటర్నెట్ కాలం మనల్ని దగ్గర చేసింది కానీ మన మూలాలను దూరం చేసింది. వందేమాతరం పిలుపు నేటి విద్యార్థికి నినాదం కాకుండా ఒక “స్ఫూర్తి సూత్రం”గా మారితేనే దాని అసలు ఉద్దేశ్యం నెరవేరుతుంది.
విమర్శనాత్మక దృష్టి
కొంతమంది విమర్శకులు చెబుతున్నారు. వందేమాతరం గీతంలో ఉన్న మాతృభూమి ఆరాధన “ధార్మిక” స్వరూపం కలిగి ఉందని, అది కొన్ని మతాలకు అనుకూలం కాదని. ఈ చర్చలు వందేమాతరం చుట్టూ వివాదం సృష్టించాయి. కానీ ఒక గీతం యొక్క అంతరార్థం రాజకీయమో, మతమో కాదు, అది సాంస్కృతిక ఆత్మ.
బంకి౦చంద్ర చటర్జీ ఊహించిన “మాతా” అనేది భూభాగానికి ప్రతీక. అది మనల్ని పోషించిన భూమికి కృతజ్ఞతాభివందనం. నేటి తరం దానిని మతరహితంగా, మానవతా దృష్టితో అర్థం చేసుకోవాలి.
కాలానుగుణ ప్రాముఖ్యత
భారతదేశం ఇప్పుడు ప్రపంచ వేదికపై వేగంగా ఎదుగుతోంది. కానీ దానితోపాటు పెరుగుతున్న సాంస్కృతిక విస్మరణ, సామాజిక విభజన, పర్యావరణ సంక్షోభం వంటి సమస్యలు మన ముందున్నాయి. ఇలాంటి సమయంలో “వందేమాతరం” గీతం మాతృభూమి పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, సహజీవన స్ఫూర్తి కోసం మళ్ళీ గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
ఈ గీతం కేవలం గతాన్ని గౌరవించడం కాదు . భవిష్యత్తును సంరక్షించడమూ. నేటి తరానికి వందేమాతరం అంటే, దేశం పట్ల కర్తవ్యభావం, పర్యావరణ పట్ల ప్రేమ, ప్రజల పట్ల సమానభావం అని అర్థం కావాలి.
నేటితరం గీతం..
సి,నా.రె అన్నట్టు వందేమాతర గీతం వరసమారుతున్నది తరం మారేకొలది దాని స్వరం మారుతున్నది . సుజల విమల కీర్తనలో సఫలాయశ వర్తనలో, శీతల పదకోమల భావన బాగున్నా జనం కంటిలో తెలియని మంట రగులుతున్నది. ముసిముసినవ్వుల మాటున విషం మరుగుతున్నది. సమాజానికి చిదిమేసినా వదలని చీడ అంటుకున్నది. రంగురంగుల కలల మాటున కనిపించని చీకట్ల దారులు ముసురుతున్నవి.
అవును .. జరుగుతున్న పోకడలన్నీ పాత ఒక రోత కొత్త ఒక వింత అన్నట్టు ఉంటున్నాయి..నాగరికత పేరుతో కొత్త అలవాట్లు యువతను చెడ్డదారివైపు లాగేస్తున్నాయి. ఉన్న సంప్రదాయాలన్నీ ఉసూరు మంటూ వేడుకలై వేదికలెక్కి కొత్త రంగు పులుముకుని వెర్రి కేకలు వేస్తున్నాయి. 64 కళలన్నీ కలలుగా మారి పుస్తకాల్లో రాతల్లా, గోడలపై గీతల్లా వెళ్ళాడుతున్నాయి. ఒకప్పుడు అమృతం కురిపించే రాగాలన్నీ ఇప్పుడు వెర్రి కేకలై బ్రతుకు లేక బాధ తో విలపిస్తున్నాయి. ఆచారాలన్నీ ఆటకెక్కి వాట్సాప్ లో స్టేటస్ లా మూలుగుతున్నాయి. నేటితరానికి పాత తరానికి మద్య అంతరం కొండంత ఉంది.
తరాల మధ్య అంతరం ..
తల్లి భరత మాత దాస్య శృంఖలాలు చేధనలో అశువులు బాసిన వీరులు ఎందరో తమ గుండెను పరాయి పాలకుల తూటాకు బలిచ్చి అమరులయ్యారు. ఇప్పుడు ఆ దేశభక్తి ఏ కోసానన్నా మనలో వుందా.. అప్పటి తల్లుల పెంపకం అలాంటిది. ఉగ్గుపాలతో దేశ భక్తిని రంగరించి పోసేవారు. తాను మరణించినా మరోతరం స్వేచ్చా గాలి పీల్చాలనే నిస్వార్ధం వాళ్ళది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ రాజకీయ బురద మరకలు అంటించుకుంటూ దేశ భక్తి ముసుగు వేసుకుని ప్రజాక్షేత్రం లో పరిపాలకులై స్వేచ్చ గా రెక్కలు విప్పుకున్న గ్రద్ద ల్లా తిరిగేస్తున్నారు.
పక్కనే బస్సులు కాలి కొందరు, వంద రూపాయల బిర్యానీ పోట్లానికి ఆశపడి సమావేశాలకని వెళ్ళి తొక్కిసలాటలో మరికొందరు, దేవుడి సేవకాని వెళ్ళి తిరిగిరాని లోకాలకు మరికొందరు, ఇలా ప్రతీ రోజు ప్రతీ చోటా ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే చూస్తూ చర్యలు తీసుకుంటున్నాం అంటూ, కమిటీ వేశాం అంటూ కొందరు చేతులు దులిపేసుకుంటుంటే, మరోపక్క అధికార యంత్రాంగం తూతూ మంత్రంగా రెండురోజులు హడావిడి చేసి మరో సంఘటన జరగగానే మొదటిదానికి తిలొదకాలు ఇచ్చేస్తు, జీతమే మా జీవితం అన్నట్టు పనిచేస్తున్నారు. ఇక ప్రజానీకం పక్కనున్న వాళ్ళు చరావాణి పట్టుకుని, సాయమో రామచంద్ర అన్నవారిని వదిలేసి సెల్ఫీలు తీసుకుంటున్నారు. కష్టం ఎవరిదన్నా, సాయం ఎవరికైనా చేయడమే నిజమైన దేశ భక్తి.
మరి దేశభక్తి ఇక్కడ ప్రజా సేవలో ఎక్కడ కనిపిస్తుంది? దేశభక్తి అంటే ఆగస్టు 15 కో జనవరి 26 రోజునో జెండా ఎగరేసి చూపించేదికాదు. మానవతా దీపం వెలిగించేది దేశభక్తి. ఎండకు ఎండుతూ భరించలేని చలిలో వణుకుతూ నడి రాత్రిలో సరిహద్దులో కాపుకాసేది దేశభక్తి. దాన్ని ప్రజలందరికీ పరిచయం చెయ్యాలి. దక్షిణ కొరియా లో ఒక పద్ధతి అమలులో ఉంది. పుట్టిన ప్రతి వ్యక్తి సైన్యం లో శిక్షణ తీసుకోవాలని, ఇది వారికి శిక్ష కాదు, అందరూ విధిగా రాజ్యాంగం హక్కులతో పాటు వారి విధులు గురించి కూడా తెలుసుకోవాలని .. అప్పుడే తోటివారికి కష్టం వస్తే మనం స్పందిస్తామని, భాద్యతతో నడుస్తామని ,క్రమ శిక్షణతో కూడిన నడక అవసరం నేటితరానికి ఎంతైనా వుంది అని తెలియజేయడం కోసమే వారి ఈ ప్రయత్నం. మరి మనదేశం లో ..
సమాజం మారాలి ? అంటే ఎక్కడినుండి మారాలి ? నీ నుండా ,నా నుండా, కాదు మన నుండి మారాలి. నీతులు చెప్పేవాళ్ళు చాలా మంది, మరి అమలుచేసేది ఎవరు ? రాముడు దేవుడు కాదు మనిషే .. మంచిని ఆచరణలో పెట్టి చూపాడు కాబట్టి దేవుడయ్యాడు. అందుకే ఆచరించి చూపిస్తే మాటకు అర్ధం,విలువ వుంటాయి. అందరూ అలా ఉండాలని కాదు, ఈ సువిశాల భారతాన్ని మార్చడం ఒక్కరివల్ల అవుతుందనీ కాదు అందరూ కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాలి. అలా నడిపించే నిజమైన దేశభక్తి తో కూడిన నాయకుడు రావాలి.
నిజమైన దేశభక్తి అంటే వందల చేతులు కలవాలని, వేల గొంతులు మాట్లాడాలని, లక్షల ప్రజలు లక్ష్య సాధనతో ముందుకు నడవాలని, భిన్నత్వం లో ఏకత్వం తీసుకు రావాలని దేశభక్తి కి నిర్వచనం గా అందరి కలిసి మెలిసి ఉండాలని, స్వేచ్చ వాయువులు పీల్చడం మాత్రమే కాదు, ఆ పీల్చే గాలి స్వచ్చంగా, సామాజికంగా సంప్రదాయంగా, సా౦స్కృతికంగా ,ఆర్ధికంగా మనిషి ప్రాణానికి ఊపిరి నిచ్చేలా వుండాలని..అంతేకాని స్వార్ధం తో పది తరాలకు సరిపోయే సంపద పొగుజేసుకుంటూ, పక్కవాళ్ళని తొక్కేస్తూ వెళ్ళమని కాదు, ఒక చేయి పది మందికి చేయూత నివ్వాలని ఇది అర్ధం చేసుకుంటే మరో తరం మనల్ని గౌరవిస్తుంది.
మార్పు మొదలయ్యిందా ..
ఒకవైపు దేశంలో ఆడపిల్ల అర్దరాత్రి ఒంటరిగా తిరిగగలిగితే స్వతంత్రం వచ్చినట్టే అని ఒక మహనీయుడు అంటే, ఇప్పుడు అర్ధరాత్రి ఆడపిల్ల ఎందుకు తిరగడం అని ఒకరంటున్నారు. ఎమిటీ వైపరీత్యం ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అంటూనే ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న ఆడపిల్లలను మళ్ళీ వంటిల్లు దాటానివ్వకూడా చేయడమేనా మార్పు. దేశం మారింది . తరాలు మారుతున్నాయి. కాని కనిపించని అంతరాలు తరాల మధ్య వారధిని తీసి అడ్డుగోడ లై కొత్త శాసనాలు రాస్తున్నాయి. ప్రతీ చోటా నిజాయితీ లేని పోటీ , వెనుకబడిన వర్గాల మంటూ వెనకనుండి లూటీ .. అన్ని యంత్రంగాలు ,మంత్రా౦గాయాలు స్వప్రయోజనాలకే ఇదేనా మార్పు. సాంప్రదాయాలు సంకెళ్ళు కాదు .. ఆచారాలు అడ్డుగోడలు కాదు అవి మన పురాతన సంపదలు . వాటిని వెనకటితరం మనకి అందించినంత భద్రంగా మనం మరో తరానికి అందించాలి. అంతేకాని కొత్త వాటి మోజులో పాత సంప్రదయాల్ని పాతరేయకూడదు.
వందేమాతరం శాశ్వత నినాదం
కాలం మారినా, నినాదం మసకవడదు. “వందేమాతరం” గీతం భారతదేశ ఆత్మను ప్రతిబింబిస్తుంది. నేటి యువతకు దాని ప్రాధాన్యం జెండా ఎగురవేయడంలోనే కాదు, విలువలను నిలబెట్టడంలో ఉందని తెలియాలి. మాతృభూమి పట్ల మన బంధం, ప్రేమ, కర్తవ్యాన్ని గుర్తుచేసే ఈ గీతం, తరతరాలకూ స్ఫూర్తి వనరుగా నిలవాలి.
