
వందేమాతరానికి 150 ఏళ్లు
భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రేరణనిచ్చిన అజరామర జాతీయ గీతం ‘వందేమాతరం’ 150 ఏళ్ల పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా నవంబర్ 7న బీహార్‌లో జరిగే సామూహిక ఆలాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు.1875లో బంకించంద్ర చటర్జీ రచించిన వందే మాతరం దేశభక్తి, ఐక్యత, సాంస్కృతిక గౌరవానికి ప్రతీకగా నిలిచింది. ఈ గీతం భారత స్వతంత్ర పోరాటానికి ప్రేరణగా మారి, తరతరాలను దేశభక్తి భావాలు ఉప్పోంగేలా చేసింది. ఈ స్ఫూర్తిదాయక గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తమ తమ ప్రాంతాల్లో నవంబర్ 7న ఒకేసారి వందే మాతరం పాడనున్నారు. ఇదే సమయంలో, న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ సామూహిక గానం కార్యక్రమం ద్వారా దేశంలోని ప్రజలు ఒకే తాత్పర్యంతో మాతృభూమి పట్ల అంకితభావం, ఐక్యత, దేశభక్తి అనుభూతి చెందేలా లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల అక్టోబర్ 26న జరిగిన ‘మన్ కి బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, “వందేమాతరం అనేది మన గుండెల్లో దేశభక్తి ఉప్పొంగించే పదం. ‘వందేమాతరం’ అనే ఒక్క మాటే మా భారతీ పట్ల మనలో తల్లిప్రేమను, బాధ్యతను జాగృతం చేస్తుందని అన్నారు. ఈ వేడుకలు దేశవ్యాప్తంగా ఒకే సమయానికి జరగడం ద్వారా భారతదేశం ఏకతా సంకల్పాన్ని ప్రతిబింబించనున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
వందేమాతరం 100 ఏళ్లు పూర్తి చేసిన సందర్భం (1875–1975)
1975లో కేంద్రంలో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే ఆ సమయానికే భారతదేశంలో అత్యంత వివాదాస్పదమైన కాలం కొనసాగింది. అదే ఎమర్జెన్సీ (1975–77). ఆ సమయంలో రాజకీయ కార్యకలాపాలు పరిమితమయ్యాయి, పత్రికా స్వేచ్ఛపై నియంత్రణ విధించారు. దాంతో వందే మాతరం శతాబ్ది వేడుకలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అధికారికంగా జరగలేదు. కొన్ని సాంస్కృతిక సంస్థలు, విద్యాసంస్థలు, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో స్వతంత్రంగా కార్యక్రమాలు నిర్వహించాయి. కానీ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో లేదా జాతీయ స్థాయిలో పెద్దగా వేడుకలు జరగలేదు.
వందేమాతరం గేయ విశిష్టత
• రచయిత: బంకిం చంద్ర చటర్జీ (1875లో రచించారు)
• మూల గ్రంథం: ఆనందమఠం నవలలో భాగంగా ఇది మొదటగా వచ్చింది.
• భాష: సంస్కృత–బెంగాలీ మిశ్రమ భాష.
• సంగీతం: పండిట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ గీతానికి స్వరపరచిన సంస్కరణను 1896లో కాంగ్రెస్ సమావేశంలో మొదట పాడారు.
• అర్థం: వందే మాతరం అంటే ‘మాతృభూమికి వందనం’‘తల్లీ భారతమాతా’ నీకు నమస్కారం అని భావం.
ప్రాముఖ్యత
భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఈ గీతం నినాదంగా మారింది. బాల గంగాధర్ తిలక్, అరవిందఘోష్, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు దీన్ని జాతీయ ఆవేశానికి చిహ్నంగా నిలబెట్టారు. ఇది జాతీయ గీతంగా 1950లో రాజ్యాంగం ద్వారా గుర్తింపు పొందింది.
