
'వందేమాతరం' వేళ ఎంఐఎం వాకౌట్.. దేశానికే అవమానం: బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా “వందే మాతరం” గేయం పాడుతున్న సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడం వివాదానికి దారి తీసింది. దీనిపై బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ, ఇది ముమ్మాటికీ "దేశాన్ని అవమానించడమే" అని ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, ఎంఐఎం ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రజలకే కాదు, దేశ ప్రజలందరికీ అవమానం చేశారు. వీరికి దేశం మీద, రాజ్యాంగం మీద నమ్మకం లేదు.. అసెంబ్లీలో వందే మాతరం పాడుతున్న సమయంలో బయటకు వెళ్లడం ద్వారా వారు తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. వారికి దేశంపై నమ్మకం లేదని, కేవలం తమ మతానికే విధేయత చూపుతున్నారని ఇది స్పష్టం చేస్తోందని అన్నారు. వందేమాతరం పట్ల వారికి ఎందుకు అంత వ్యతిరేకత అని ఆయన ప్రశ్నించారు.
ఇదే అంశంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, వందేమాతరం పాడుతున్నప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడం సిగ్గుచేటు. ఇది కేవలం నిరసన కాదు, మాతృభూమి స్ఫూర్తిని, జాతీయ గేయాన్ని ప్రత్యక్షంగా అవమానించడమే అని పేర్కొన్నారు. భారతీయ చిహ్నాలంటే ఎంఐఎంకు ఎందుకు అంత ఎలర్జీ? అని ఆయన ప్రశ్నిస్తూ, వారి అసలు రంగు బయటపడిందని విమర్శించారు.
మరోవైపు, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ ఈ అంశంపై భిన్నంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, దేశానికి సంబంధించిన ప్రతీ అంశాన్ని గౌరవించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, దాన్ని ఎవరిపైనా బలవంతంగా రుద్దకూడదని అన్నారు. జాతీయ జెండాను, జాతీయ గీతాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. కానీ ఎవరినీ బలవంతం చేయలేం అని ఆయన అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో వందేమాతరం పాడి జైలుకు వెళ్ళిన వారి పేర్లు ఐదుగురిని బీజేపీ చెప్పగలదా అని ఆయన ప్రశ్నిస్తూ, దేశానికి సంబంధించిన అంశాలను గౌరవించాలని హితవు పలికారు.
తెలంగాణ అసెంబ్లీలో కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం జాతీయ, రాష్ట్ర గీతాలను ఆలపిస్తున్న సమయంలో ఎంఐఎం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు దీనిని దేశభక్తితో ముడిపెడుతుండగా, మరోవైపు వ్యక్తిగత స్వేచ్ఛ కోణంలో కూడా చర్చ జరుగుతోంది.
