Let's talk: editor@tmv.in
‘వందేమాతరం’ తరతరాలకు దేశభక్తి స్ఫూర్తినిచ్చే గీతం: ప్రధాని మోడీ

‘వందేమాతరం’ తరతరాలకు దేశభక్తి స్ఫూర్తినిచ్చే గీతం: ప్రధాని మోడీ

Shaik Mohammad Shaffee
8 నవంబర్, 2025

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తినిచ్చిన జాతీయ గీతం 'వందేమాతరం' 150వ వార్షికోత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం న్యూఢిల్లీలో ఘనంగా ప్రారంభించారు. ఈ ఉత్సవాలు నవంబర్ 7, 2026 వరకు ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా జరగనున్నాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోడీ ఈ చారిత్రక వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన స్మారక తపాలాబిళ్ల, ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. వీటితో పాటు దేశ పౌరులు తమ జాతీయ గీతాన్ని ఆలపించి, ఆ వీడియోలను అప్‌లోడ్ చేసి సర్టిఫికెట్‌ను పొందే అవకాశాన్ని కల్పించే 'vandemataram150.in' అనే డిజిటల్ పోర్టల్‌ను కూడా ప్రధాని మోడీ ప్రారంభించారు.

వందేమాతరం ఒక మంత్రం, సంకల్పం: మోడీ

సభను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం ఆకర్షణీయంగా నిలిచింది. వందేమాతరం ప్రాముఖ్యతను ప్రధాని మోడీ వివరించారు. "వందేమాతరం అనేది కేవలం ఒక పదం కాదు, అది ఒక మంత్రం, ఒక శక్తి, ఒక కల, ఒక సంకల్పం. ఇది భరతమాత పట్ల భక్తి, ఆరాధన” అని అన్నారు. ఈ గీతం మనకు ఘన చరిత్రను గుర్తు చేస్తుందని, వర్తమానాన్ని ఆత్మవిశ్వాసంతో నింపుతుందని, భవిష్యత్తు కోసం కొత్త ధైర్యాన్ని అందిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. "సాధించలేని సంకల్పం లేదు. భారతీయులు సాధించలేని లక్ష్యం లేదు. ఈ గేయం మన భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది” అని చెప్పారు.

"వందేమాతరం సామూహికంగా పాడటం అనేది భావ వ్యక్తీకరణకు మించిన అద్భుత అనుభవం. ఒకే లయ, స్వరం, భావంతో ఈ గీతాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుంది” అని ప్రధాని అన్నారు.

బంకించంద్ర ఛటర్జీ రాసిన 'ఆనంద్‌మఠ్' కేవలం నవల కాదని గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకసారి చెప్పారని ప్రధాని మోడీ అన్నారు. ఇది స్వతంత్ర భారతదేశ స్వప్నం అని అన్నారు. బంకించంద్ర ఛటర్జీ రాసిన ప్రతి పదానికి లోతైన అర్థం ఉందని, వందేమాతరం గీతం ప్రతి యుగంలోనూ సందర్భోచితంగా ఉంటుందని ప్రధాని మోడీ నొక్కి చెప్పారు.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, కేంద్ర సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర మంత్రి షెకావత్, “వందేమాతరం గీతం స్వాతంత్య్ర సమరయోధుల హృదయాల్లో తిరుగుబాటు స్పూర్తిని నింపింది. వారు చివరి శ్వాసవరకు ఈ గీతాన్ని జపించారు” అని పేర్కొన్నారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ‘వందేమాతరం’ భారతీయుల హృదయాల్లో దేశభక్తిని నింపుతూ, ప్రోత్సహిస్తూ వస్తోందని కేంద్రమంత్రి షెకావత్ పేర్కొన్నారు. ఈ గీతం ఇప్పటికీ సందర్భోచితంగా ఉందని, ఇది ‘ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్’ మంత్రంగా నిలిచి, 140 కోట్ల భారతీయుల శక్తి, ఏకత్వాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు.

‘వందేమాతరం' గీతాన్ని దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో సామూహికంగా ఆలపించే కార్యక్రమాలు ఈ ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ సామూహిక గానంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏమన్నారంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయోద్యమ మహనీయులకు ఘన నివాళులర్పించారు. వందేమాతరం.. జాతీయ గీతం స్ఫూర్తిగా, సమైక్యతా భావంతో దేశ అభివృద్ధికి పునరంకితమవుదామని పిలుపునిచ్చారు.

“ఇది కేవలం ఒక పాట మాత్రమే కాదు, స్వాతంత్య్ర పోరాట ర్యాలీల నుండి పాఠశాల సమావేశాల వరకు దేశభక్తి నిండిన ప్రతిచోటా ప్రతిధ్వనించిన ఒక నినాదం. ఈ నినాదం తరతరాలకు గర్వం మరియు భక్తిని పంచుతూ స్ఫూర్తినిచ్చింది. బంకించంద్ర ఛటర్జీచే రచించబడిన ఈ గీతం, ఐక్యత, ధైర్యం యొక్క కీర్తన. ఇది మన మాతృభూమికి అందించే శాశ్వతమైన వందనం. దీని శ్రావ్యత నేటికీ గర్వంగా ప్రతిధ్వనిస్తూ, ప్రతి భారతీయుడిని కలుపుతున్న బంధాన్ని నిరంతరం గుర్తుచేస్తుంది. వందేమాతరం!” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

“వందేమాతరం స్ఫూర్తిని భావి తరాలకు అందించే బాధ్యత మనదే. మన దేశ స్వాతంత్య్ర పోరాటంలో కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ రణ నినాదంలా నిలిచింది వందేమాతరం. బంకించంద్ర ఛటర్జీ రాసిన ఈ గేయం యావత్ దేశాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడిపించింది. స్వతంత్ర సమరయోధులకు మనో బలాన్ని ఇచ్చింది. బ్రిటిషర్లను వందేమాతరం అనే మాటే భయపెట్టింది. భారతీయుల నోట మంత్రంలా మారిన వందేమాతరాన్ని పలికితే జైళ్ల పాలుజేశారు. ఈ రోజుకీ వందేమాతరం ఆలపించినా, విన్నా నరనరాన దేశభక్తి నిండుతుంది. ఒళ్ళు పులకరిస్తుంది. బంకించంద్ర ఛటర్జీ మన జాతికి అందించిన ఆ గేయంలో ఉన్న శక్తి అది. పోరాట స్ఫూర్తిని నింపిన వందేమాతరం గురించి భావి తరాలకు ఘనంగా తెలియచేయాలి” అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.

“’వందేమాతరం’ 150 సంవత్సరాల స్ఫూర్తికి నా వందనం. బంకించంద్ర ఛటర్జీ రచించిన ఈ పవిత్ర గీతం మన స్వాతంత్య్ర సమరయోధులలో రగిలించిన ఐక్యతా భావనే మనందరికీ ఆదర్శం. ఆ స్ఫూర్తితో మ‌న భావిత‌రాల కోసం, వారి అభివృద్ధికోసం క‌లిసి ప‌నిచేద్దాం” అని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

వందేమాతరం గీతాన్ని బంకించంద్ర ఛటర్జీ 1875వ సంవత్సరం నవంబర్ 7న అక్షయ నవమి పర్వదినం సందర్భంగా రచించారు. ఈ గీతాన్ని తొలిసారిగా ఆయన రాసిన “ఆనంద్‌మఠ్” నవలలో భాగంగా “బంగదర్శన్” అనే సాహిత్య పత్రికలో ప్రచురించారు. భరతమాతను శక్తి, సంపద, దైవత్వానికి ప్రతీకగా ప్రతిబింబిస్తూ ఈ గీతం భారత ఐక్యత, జాతీయ గౌరవానికి చిరస్మరణీయ చిహ్నంగా నిలిచింది.