Let's talk: editor@tmv.in
‘వందేమాతరం తప్పనిసరి’ ఆదేశంపై జామియత్ విమర్శలు

‘వందేమాతరం తప్పనిసరి’ ఆదేశంపై జామియత్ విమర్శలు

Pinjari Chand
13 ఫిబ్రవరి, 2026

కేంద్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయం ‘వందే మాతరం’లోని ఆరు చరణాలను తప్పనిసరిగా పాడాలని ఇచ్చిన ఆదేశంపై ప్రముఖ ముస్లిం సంస్థ జామియత్ ఉలమా-ఇ-హింద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం ఏకపక్షం, యాదృచ్ఛికమని పేర్కొంటూ, ఇది రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛపై ‘స్పష్టమైన దాడి’ అని ఆరోపించింది. జామియత్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదనీ గురువారం మాట్లాడుతూ, ముస్లింలు ఎవరైనా ‘వందే మాతరం’ పాడడాన్ని లేదా వినిపించడాన్ని ఆపరని చెప్పారు. అయితే ఆ గీతంలోని కొన్ని చరణాలు దేశాన్ని దేవతగా చిత్రీకరించే భావనలను కలిగి ఉన్నాయని, అది ఏకదైవ సిద్ధాంతాన్ని అనుసరించే మతాల మూల విశ్వాసాలకు విరుద్ధమని అన్నారు.

ముస్లింలు ఒకే అల్లాహ్‌ను ఆరాధిస్తారు. అలాంటి వ్యక్తిని ఈ గీతం పాడమని బలవంతం చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 25కు విరుద్ధం. ఇది మైనారిటీల రాజ్యాంగ హక్కులను పరిమితం చేసే చర్య అని మదనీ ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. దేశభక్తి నినాదాల ద్వారా కాకుండా వ్యక్తిత్వం, త్యాగాల ద్వారా వ్యక్తమవుతుందని, ముస్లింలు, జామియత్ స్వాతంత్ర్య పోరాటంలో చేసిన సేవలు దీనికి ఉదాహరణలని ఆయన చెప్పారు. ఇటువంటి నిర్ణయాలు దేశంలోని శాంతి, ఐక్యత, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తాయని ఆరోపించారు.

ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, జాతీయ గీతం ‘వందే మాతరం’ (బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ రచన) జాతీయ గానం ‘జన గణ మన’ రెండూ కలిసి పాడినప్పుడు ముందుగా ‘వందే మాతరం’ను పాడాలని పేర్కొంది. ఆరు చరణాల మొత్తం వ్యవధి 3 నిమిషాలు 10 సెకన్లు ఉంటుంది. రాష్ట్రపతి రాక, జాతీయ పతాక ఆవిష్కరణ, గవర్నర్ల ప్రసంగాలు వంటి అధికారిక కార్యక్రమాల్లో ఈ నియమాలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులో తెలిపింది. గీతం పాడినప్పుడు సభలో ఉన్నవారు నిలబడాలని కూడా పేర్కొంది. అయితే డాక్యుమెంటరీలు లేదా వార్తాచిత్రాల్లో భాగంగా గీతం వినిపించినప్పుడు ప్రేక్షకులు తప్పనిసరిగా నిలబడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పాఠశాలల్లో కూడా పాఠాలు ప్రారంభించే ముందు జాతీయ గీతం వినిపించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ‘వందే మాతరం’ 150వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఈ మార్గదర్శకాలు జారీ చేసింది.

బలవంతం చేయడం తగదు– వారిస్ పఠాన్

‘వందే మాతరం’ను మేము గౌరవిస్తాం కానీ దాన్ని బలవంతంగా చెప్పించడం తప్పు అని ఏఐఎంఐఎం జాతీయ ప్రతినిధి వారిస్ పఠాన్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి వ్యక్తికి తన మతాన్ని ఆచరించే హక్కు ఉందని ఆయన చెప్పారు. ముస్లింలు సహా ప్రతి ఒక్కరూ తమ తమ విశ్వాసాలను అనుసరించేందుకు స్వేచ్ఛ కలిగి ఉన్నారని పేర్కొన్నారు. అయితే జాతీయ గేయంలోని కొన్ని పంక్తులు ఆచరణలో ఉన్న ముస్లింలకు అనుకూలంగా ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరిని బలవంతం చేయడం అవసరం లేదు. జాతీయ గీతం పాడినప్పుడు మేము గౌరవంగా నిలబడి హృదయపూర్వకంగా ఆలపిస్తాం. కానీ దాన్ని పాడకపోతే ఎవరినైనా దేశద్రోహి లేదా దేశభక్తి లేని వ్యక్తిగా ముద్ర వేయడం పూర్తిగా తప్పు. ఒకరి మతాన్ని ఆధారంగా చేసుకుని వారి దేశభక్తిని కొలిచే హక్కు ఎవరికి ఉంది? అని పఠాన్ ప్రశ్నించారు.