
‘వందేమాతరం’ చర్చల్లో నెహ్రు బయటపడతారు: బీజేపీ
లోక్‌సభలో వందేమాతరం 150 వ వార్షికోత్సవం సందర్భంగా జరగబోయే చర్చలో జవహర్‌లాల్ నెహ్రూ నిజస్వరూపం బయటపడుతుందని ఆదివారం బీజేపీ తెలిపింది. దేశ తొలి ప్రధాని నెహ్రూను దూషించడమే ప్రస్తుత పాలక వ్యవస్థ ముఖ్య లక్ష్యమని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ చేసిన ఆరోపణను బీజేపీ తీవ్రంగా ఖండించింది.
నెహ్రూ వారసత్వాన్ని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్, సుభాష్ చంద్ర బోస్ వంటి నాయకుల వారసత్వాన్ని అంతం చేయడానికి ప్రయత్నించిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. నెహ్రూ-గాంధీ కుటుంబ ప్రచారం ఆపమని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరారు. నెహ్రూ వారసత్వాన్ని ఎవరు అంతం చేయగలరు అంటే… ఇప్పుడు బెయిల్ మీద ఉన్న ఈ తరం గాంధీలే (నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ) కదా అని ఎంపీ సంబిత్ మీడియాతో అన్నారు.
గాంధీల పేరు స్పష్టంగా చెప్పకుండానే, నెహ్రూ ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్‌ను స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణపై వారిపై ఇటీవల ఎఫ్‌ఐఆర్ నమోదైందని గుర్తు చేశారు. నెహ్రూ వారసత్వాన్ని ఎవరూ కాదు, వీళ్లే నాశనం చేస్తున్నారు. రేపు పార్లమెంటులో వందేమాతరం చర్చ జరిగినప్పుడు నెహ్రూజీ నిజస్వరూపం అందరికీ తెలుస్తుంది.
వందేమాతరం జాతీయ గీతం 150వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీ చర్చను ప్రారంభిస్తారు. మంగళవారం (డిసెంబర్ 9) రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చను ప్రారంభిస్తారు. లోక్‌సభలో ఈ చర్చకు 10 గంటల సమయం కేటాయించారు.
చరిత్రను రాయడం కాదు – సరిదిద్దడమే
చరిత్రను తిరిగి రాయడం కాదు. భారత స్వతంత్ర సమరంలో, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినవారికి నిజమైన గౌరవం ఇవ్వడమే మా లక్ష్యం అని పాత్రో అన్నారు. కాంగ్రెస్‌లో మొదటి ప్రధాని ఎన్నికలో ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవించి ఉంటే సర్దార్ పటేల్ ప్రధానమంత్రి అయ్యేవారని వ్యాఖ్యానించారు. బీజేపీ చరిత్రను మళ్లీ రాయడం లేదు, చరిత్రను సరిచేయడానికి ప్రయత్నిస్తోంది. స్వాతంత్ర్య పోరాటంలో, దేశ నిర్మాణంలో నిజంగా కృషి చేసిన వారికి గుర్తింపు ఇవ్వాలన్నదే మా ఉద్దేశ్యం.
స్వాతంత్ర్య పోరాటంలోనూ, రాజ్యాంగ నిర్మాణంలోనూ తమ భావజాలానికి ఎలాంటి పాత్ర లేదని అందుకే నెహ్రూను లక్ష్యంగా చేసుకుంటున్నారని సోనియా గాంధీ అనగా… ఆ మాట అనే అర్హత సోనియాకు లేదని పాత్రా తిప్పికొట్టారు.
సోనియా గాంధీజీ… మీరు ఈ ప్రశ్న అడగకూడదు. ఎందుకంటే దేశం మీకు మరో ప్రశ్న వేస్తుంది. ఒకప్పుడు అంటోనియా మైనోగా పిలుచుకునే సోనియా గాంధీ, మీ కుటుంబం భారత స్వాతంత్ర్య పోరాటంలో ఏం చేసింది? అని ప్రశ్నించారు.
మేం అందరం ఏ విధంగానైనా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నవాళ్లం లేదా మా ముందు తరాలవాళ్లు పాల్గొన్నారు. కానీ మీరు ఈ దేశానికే చెందినవాళ్లు కాదు. కాబట్టి మీరు మాకు స్వాతంత్ర్య పోరాట పాత్ర గురించి ప్రశ్నించే అర్హత లేదని తీవ్రంగా మండిపడ్డారు.
నెహ్రుది నకిలీ లౌకిక వాదం
నెహ్రూకు లౌకికవాదంలో గట్టి నమ్మకం ఉండేదని సోనియా అనగా… అది నకిలీ లౌకికవాదం మాత్రమే అని ఆరోపించారు. వందేమాతరం అసలు స్వరూపం ముస్లింలకు చిరాకు కలిగిస్తుందని ఒకసారి నెహ్రూ అన్నారని, ఆయన లౌకికవాదంలో శ్రీరాముడికి చోటు లేదని పాత్రా విమర్శించారు. రేపు వందేమాతరం చర్చలో నెహ్రూజీ మళ్లీ చర్చనీయాంశమవుతారు, బహుశా బయటపడతారు అని పాత్రా పునరుద్ఘాటించారు. మహాత్మా గాంధీ హత్యకు ఒక భావజాలమే కారణమని సోనియా గాంధీ పదేపదే చెప్పడంపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ న్యాయవ్యవస్థపై, సుప్రీంకోర్టుపై కూడా సోనియాకు నమ్మకం లేదని ఆయన విమర్శించారు.
