
వంటగ్యాస్, సిఎన్‌జీ సరఫరాకు ప్రాధాన్యం.. గ్యాస్ కేటాయింపుల్లో కేంద్రం మార్పులు
పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా దిగుమతి గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజ వాయువు (నేచురల్ గ్యాస్) కేటాయింపులో ప్రాధాన్యత క్రమాన్ని సవరించింది. కొత్త విధానంలో ఎల్పీజీ ఉత్పత్తి, వాహనాల కోసం సిఎన్‌జీ, గృహాలకు పైపుల ద్వారా అందించే వంటగ్యాస్‌కు మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ మూడు రంగాల అవసరాలను పూర్తిగా తీర్చిన తర్వాతే ఇతర రంగాలకు గ్యాస్ సరఫరా చేస్తారు.
ఎరువుల రంగానికి రెండో స్థానం
ప్రాధాన్యత క్రమంలో ఎరువుల పరిశ్రమను రెండో స్థానంలో ఉంచారు. ఈ రంగానికి గత ఆరు నెలల సగటు గ్యాస్ వినియోగంలో కనీసం 70 శాతం సరఫరా చేయాలని నిర్ణయించారు. టీ పరిశ్రమలు, తయారీ రంగం, ఇతర పారిశ్రామిక వినియోగదారులకు మూడో ప్రాధాన్యం కల్పించారు. వీరికి గత ఆరు నెలల సగటు వినియోగంలో 80 శాతం వరకు గ్యాస్ సరఫరా చేయాలని నిర్ణయించారు.
సిటి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌కు నాలుగో స్థానం
సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) సంస్థల ద్వారా పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులకు సరఫరా చేసే గ్యాస్‌కు నాలుగో ప్రాధాన్యం ఇచ్చారు.
భారతదేశంలో రోజుకు సుమారు 191 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు వినియోగం జరుగుతోంది. ఇందులో దాదాపు సగం దేశీయ ఉత్పత్తి ద్వారా నెరవేరుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ గ్యాస్‌ను ప్రాధాన్య రంగాలకు మళ్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీని కోసం పెట్రోకెమికల్ ప్లాంట్లు, విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు, అధిక ధర గ్యాస్ వినియోగదారులకు సరఫరాను తగ్గించనుంది.
హోర్ముజ్ జలసంధి ప్రభావం
అమెరికా–ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతీకార చర్యల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. దీని ప్రభావంతో హర్ముజ్ మార్గం ద్వారా జరిగే సముద్ర రవాణా తగ్గింది. ప్రపంచ సముద్ర మార్గంలో రవాణా అయ్యే చమురు లో దాదాపు ఐదో వంతు, ఎల్‌ఎన్‌జీ సరఫరాలో మూడో వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. భారత్‌కు దిగుమతి అయ్యే ఎల్‌ఎన్‌జీ, ఎల్పీజీ సరఫరాలో కూడా ఈ మార్గం కీలకం. ట్యాంకర్ రవాణా మందగించడంతో దేశీయంగా అందుబాటులో ఉన్న గ్యాస్‌ను తిరిగి కేటాయిస్తూ గృహ వంట అవసరాలు, వాహన రవాణా వంటి ముఖ్య రంగాలకు సరఫరా కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
గ్యాస్ వినియోగం ఎలా జరుగుతుంది?
భూమి లోపల లేదా సముద్ర గర్భం నుంచి వెలికితీసే సహజ వాయువును విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల తయారీ, వాహనాల కోసం సిఎన్‌జీగా మార్పు, గృహాలకు పైప్ గ్యాస్‌గా సరఫరా చేయడం వంటి అవసరాలకు ఉపయోగిస్తారు. అలాగే దీనితో వంటగ్యాస్ ఎల్పీజీ కూడా తయారు చేస్తారు.
ఎల్‌ఎన్‌జీ సరఫరా అంతరాయం
మధ్యప్రాచ్య ఘర్షణల కారణంగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్జీ) సరఫరాలో అంతరాయం ఏర్పడిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సరఫరాదారులు ‘ఫోర్స్ మేజర్’ నిబంధనను వినియోగించినట్టు తెలిపింది. దీంతో ప్రాధాన్య రంగాలకు గ్యాస్‌ను మళ్లించే నిర్ణయం తీసుకున్నట్టు నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
పెట్రోకెమికల్, విద్యుత్ రంగాలకు కోత
ప్రాధాన్య రంగాలకు గ్యాస్ అందించేందుకు ముందుగా పెట్రోకెమికల్ ప్లాంట్లు, అధిక పీడన–అధిక ఉష్ణోగ్రత గ్యాస్ వినియోగదారులు, తదుపరి విద్యుత్ ఉత్పత్తి యూనిట్లకు సరఫరా తగ్గించనున్నారు. ఇందులో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ అనుబంధ సంస్థ ఓఎన్‌జీసీ పెట్రో అడిషన్స్ లిమిటెడ్, గెయిల్ ఇండియా లిమిటెడ్ కు చెందిన పాటా పెట్రోకెమికల్ కాంప్లెక్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన ఓ2సి యూనిట్లు కూడా ఉన్నాయి. ఇక ఆయిల్ రిఫైనరీలకు గ్యాస్ సరఫరాను గత ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 65 శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాధాన్యత క్రమాన్ని అమలు చేయడం కోసం ప్రభుత్వ రంగ గ్యాస్ సంస్థ గెయిల్‌ఇండియా లిమిటెడ్‌కు బాధ్యతలు అప్పగించారు.
