Let's talk: editor@tmv.in
ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ కేసు తీర్పు వాయిదా

ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ కేసు తీర్పు వాయిదా

Pinjari Chand
11 నవంబర్, 2025

మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌, రబ్రీ దేవి, తేజస్వీ యాదవ్‌, మీసా భారతి తదితరులపై ఉన్న ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ అవినీతి కేసులో తీర్పును ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో చార్జ్‌ ఫ్రేమ్‌ చేయాలా? లేదా అనే విషయంపై కోర్టు డిసెంబర్‌ 4న నిర్ణయం వెల్లడించనుంది. స్పెషల్‌ జడ్జి విశాల్‌ గోగ్నే ఈ ఆదేశాన్ని వాయిదా వేస్తూ తదుపరి విచారణను మరుసటి వాయిదా వరకు నిలిపివేశారు. సీబీఐ ఈ కేసులో హేమా యాదవ్‌, తేజప్రతాప్‌ యాదవ్‌ సహా పలువురి అధికారులపై చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. సెప్టెంబర్‌ 11న కోర్టు ఈ కేసులో తీర్పును రిజర్వ్‌ చేసింది. సీబీఐ తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డీపీ సింగ్‌ వాదిస్తూ ఆరోపణలు నిర్ధారించడానికి సరిపడా ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

దీనికి ప్రతిగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తరపు సీనియర్‌ న్యాయవాది మనీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ, ఈ కేసు రాజకీయ ప్రేరితమైందని, ఉద్యోగాల కోసం భూములు తీసుకున్నారనే ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాలు లేవని వాదించారు. భూములను డబ్బులు పెట్టి కొనుగోలు చేసినట్లు రిజిస్టర్డ్‌ సేల్‌డీడ్లు ఉన్నాయని తెలిపారు. రబ్రీ దేవి తరఫు న్యాయవాదులు కూడా ఇదే వాదనను వినిపించారు. భూమి కొనుగోలు చేయడం నేరం కాదని, డబ్బు చెల్లించి కొనుగోలు చేశామని, ఎలాంటి ప్రయోజనాలు పొందలేదని చెప్పారు. అన్ని లావాదేవీలు చట్టబద్ధమని, అవినీతి ఆరోపణలకు ఆధారాలు లేవని సమర్థించారు. సీబీఐ మాత్రం ఈ వ్యవహారంలో అవినీతి ఉన్నట్లు పేర్కొంది. రైల్వేలో ఉద్యోగాల బదులు భూములు తీసుకున్నారని ఆ సంస్థ ఆరోపిస్తోంది.

కేసు పూర్వాపరాలు

ఈ కేసు 2004–2009 మధ్య కేంద్రంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనలకు సంబంధించినది.

సీబీఐ ఆరోపణల ప్రకారం ఆ సమయంలో రైల్వేలో తక్కువ స్థాయి ఉద్యోగాలు (గ్రూప్ డీ ) ఇచ్చే క్రమంలో కొందరి కుటుంబ సభ్యుల నుంచి భూములు పొందారు. ఉద్యోగం బదులు భూమి అనే విధంగా "ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ స్కీమ్‌" నడిచిందని ప్రధానమైన ఆరోపణ.

సీబీఐ దర్యాప్తు

సీబీఐ 2022లో ఈ కేసును నమోదు చేసింది. 2023లో చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. అందులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌, రబ్రీ దేవి, తేజస్వీ యాదవ్‌, మీసా భారతి, హేమా యాదవ్‌, తేజప్రతాప్‌ యాదవ్‌, కొంతమంది రైల్వే మాజీ అధికారులు ఉన్నారు.

రైల్వే మంత్రిత్వ కాలంలో లాలూ యాదవ్‌ ప్రభావంతో కొన్ని నియామకాలు జరిగాయి. నియామకం పొందిన వారి బంధువుల నుంచి పాట్నా, గయా ప్రాంతాల్లో భూములు చాలా తక్కువ ధరలకు లేదా ఉచితంగా లాలూ కుటుంబ సభ్యుల పేరిట రిజిస్టర్‌ చేశారు. ఈ భూములు సుమారు లక్ష రూపాయలకే కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఆ సమయానికి మార్కెట్‌ ధర దానికంటే 40–50 రెట్లు ఎక్కువగా ఉండేది.

ఇది అవినీతి చట్టం కింద క్విడ్ ప్రో కో (ఇచ్చి పుచ్చుకోవడం) లా పరిగణించారు.

ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ కేసు తీర్పు వాయిదా - Tholi Paluku