
‘ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసు’లో లాలూకు సుప్రీంలో ఎదురుదెబ్బ
రైల్వే ఉద్యోగాలకుగాను భూములు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్న కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో సోమవారం ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, చార్జ్‌షీట్‌లను రద్దు చేయాలన్న ఆయన అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. అయితే, 77 ఏళ్ల వయసున్న లాలూ యాదవ్‌కు విచారణ సమయంలో ట్రయల్ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు మంజూరు చేసింది. న్యాయమూర్తులు ఎం.ఎం. సుందరేశ్, ఎన్. కోటిస్వర సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్‌లోని సెక్షన్ 17ఏ వర్తింపుపై తుది నిర్ణయం ట్రయల్ సమయంలో తీసుకోవచ్చని పేర్కొంది.
సెక్షన్ 17ఏపై వాదనలు
ఈ సెక్షన్ ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగి అధికారిక విధుల్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాలంటే ముందస్తు అనుమతి అవసరం. సీబీఐ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు మాట్లాడుతూ, లాలూ యాదవ్ నిర్ణయం తీసుకునే అధికారి కాదని, కేవలం ప్రభావం చూపే స్థాయిలో మాత్రమే ఉన్నారని వాదించారు. అందువల్ల ఈ కేసులో ముందస్తు అనుమతి అవసరం లేదన్నారు. దీనికి ప్రతిగా లాలూ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్‌సిబల్ మాట్లాడుతూ, ముందస్తు అనుమతి లేకుండా విచారణ జరపడం చట్టబద్ధం కాదని వాదించారు.
కేసు నేపథ్యం
ఈ కేసు 2004–2009 మధ్యకాలంలో ఇండియన్ రైల్వేస్‌లో గ్రూప్–డి ఉద్యోగాల నియామకాలకు సంబంధించినది. ఆ సమయంలో రైల్వే మంత్రిగా ఉన్న లాలూ కాలంలో, ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రతిగా అభ్యర్థులు తమ భూములను ఆయన కుటుంబ సభ్యులు లేదా అనుచరుల పేర్లకు బదిలీ చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసులో 2022లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, 2022, 2023, 2024లో వరుసగా చార్జ్‌షీట్‌లు దాఖలయ్యాయి. లాలూ యాదవ్, ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు తదితరులపై అవినీతి నిరోధక చట్టం కింద ఆరోపణలు ఉన్నాయి.
ఢిల్లీ హైకోర్టు తీర్పు
మార్చి 24న ఢిల్లీ హైకోర్టు కూడా ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలన్న లాలూ పిటిషన్‌ను కొట్టివేసింది. సెక్షన్ 17ఏ 2018లో అమలులోకి వచ్చిందని, కానీ ఈ కేసులో ఆరోపణలు 2004–2009 కాలానికి చెందినవని హైకోర్టు పేర్కొంది. ట్రయల్ కోర్టు ఇప్పటికే జనవరి 9న లాలూ యాదవ్ సహా పలువురిపై అభియోగాలు మోపాలని ఆదేశించింది. ఫిబ్రవరి 16న అవినీతి నిరోధక చట్టం కింద అధికారికంగా అభియోగాలు నమోదు చేసింది. ప్రస్తుతం లాలూ యాదవ్, ఇతర నిందితులు బెయిల్‌పై ఉన్నారు. కేసు విచారణ ట్రయల్ కోర్టులో కొనసాగనుంది.
