Let's talk: editor@tmv.in
లోక్‌సభ స్పీకర్‌ తొలగింపు తీర్మానం వేళ.. సభ్యుల మధ్యే ఓం బిర్లా

లోక్‌సభ స్పీకర్‌ తొలగింపు తీర్మానం వేళ.. సభ్యుల మధ్యే ఓం బిర్లా

Pinjari Chand
6 మార్చి, 2026

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో దశలో లోక్‌సభలో అరుదైన పరిణామం చోటుచేసుకునే అవకాశం ఉంది. స్పీకర్‌గా ఉన్న ఓం బిర్లా పై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన తొలగింపు తీర్మానంపై చర్చ జరిగే సమయంలో ఆయన సభకు అధ్యక్షత వహించకుండా సభ్యుల మధ్యనే కూర్చోనున్నారు. మార్చి 9న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల రెండో దశలో ఈ తీర్మానాన్ని చర్చకు తీసుకునే అవకాశం ఉంది. సభను నడిపే సమయంలో స్పీకర్ ‘పక్షపాతంగా వ్యవహరించారు’ అంటూ ప్రతిపక్షం ఆయనపై ఈ తీర్మానం పెట్టింది. లోక్‌సభ స్పీకర్ సభలో లేకుంటే ఆయన స్థానంలో డిప్యూటీ స్పీకర్ సభను నడపాల్సి ఉంటుంది. కానీ ఆ పదవి ఖాళీగా ఉండడంతో ప్యానెల్ ఆఫ్ చైర్‌‌పర్సన్ తొలగింపు ప్రక్రియను చేపడతారు.

ప్రతిపక్షం ఆరోపణలు

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలకు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. అలాగే ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని కూడా కారణంగా చూపింది. ఈ నేపథ్యంలో కనీసం 118 మంది ప్రతిపక్ష ఎంపీలు స్పీకర్‌ను పదవి నుంచి తొలగించాలని నోటీసు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రధాన విప్ కే. సురేశ్ ఈ నోటీసును లోక్‌సభ కార్యాలయంలో అందజేశారు. ఈ నోటీసుపై కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, డీఎంకే ఎంపీలు సంతకం చేశారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మాత్రం సంతకం చేయలేదు.

చర్చ సమయంలో స్పీకర్ పాత్ర

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 96 ప్రకారం స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్‌పై తొలగింపు తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు వారు సభకు అధ్యక్షత వహించకూడదు. అయితే స్పీకర్‌కు తనపై వచ్చిన ఆరోపణలకు సభలో సమాధానం చెప్పే హక్కు ఉంటుంది. అలాగే ఆయన ఈ తీర్మానంపై ఓటు కూడా వేయవచ్చు. అయితే ఆటోమేటెడ్ ఓటింగ్ సిస్టమ్ కాకుండా ప్రత్యేక స్లిప్ ద్వారా ఓటు నమోదు చేయాల్సి ఉంటుంది.

తీర్మానం ఆమోదం ఎలా?

• స్పీకర్ తొలగింపు తీర్మానం పెట్టడానికి కనీసం ఇద్దరు ఎంపీల సంతకం అవసరం.

• నోటీసు ఇచ్చిన తర్వాత 14 రోజుల తర్వాతే అది సభలోకి వస్తుంది.

• చర్చ ప్రారంభానికి ముందు కనీసం 50 మంది సభ్యులు లేచి మద్దతు ఇవ్వాలి.

• తీర్మానం ఆమోదం పొందాలంటే సభ మొత్తం సభ్యుల సాధారణ మెజారిటీ అవసరం.

గతంలో ఇచ్చిన అవిశ్వాస తీర్మాన సందర్భాలు

ఇంతకు ముందు కూడా లోక్‌సభ స్పీకర్లపై ఇలాంటి తీర్మానాలు వచ్చినా అవి ఆమోదం పొందలేదు. జీవీ.మావళంకర్(1954), హుకం సింగ్ (1966), బల్‌రాం జకర్ (1987) ఈ ముగ్గురిపై వచ్చిన అవిశ్వాస తీర్మానాలు చివరకు తిరస్కరణకు గురయ్యాయి. సాధారణంగా ప్రభుత్వానికి లోక్‌సభలో మెజారిటీ ఉండటం వల్ల ఇలాంటి తీర్మానాలు ఆమోదం పొందడం అరుదు.