
లోక్‌సభ నియమాలు ఉల్లంఘిస్తే ప్రివిలేజ్ నోటీసు: రిజిజు
లోక్‌సభలో చేసిన ప్రసంగంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. లోక్‌సభ నియమాలు, విధానాలు ఉల్లంఘిస్తూ మాట్లాడితే ప్రివిలేజ్ నోటీసు ఎదుర్కోవాల్సి వస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు హెచ్చరించగా, బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ఆయన అనైతిక ప్రవర్తనపై ప్రత్యేక పార్లమెంటరీ విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
రిజిజు హెచ్చరిక
పార్లమెంట్ హౌస్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన రిజిజు, రాహుల్ గాంధీ సభను తప్పుదారి పట్టించేలా ఆధారరహిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. లోక్‌సభ నియమాలకు విరుద్ధంగా మాట్లాడితే ప్రివిలేజ్ నోటీసు వస్తుందని కాంగ్రెస్ ఎంపీలు రాహుల్‌కు వివరించాలని సూచించారు. ఆయనకు నియమాలపై అవగాహన లేకపోవచ్చు. కాంగ్రెస్‌లో అనుభవం ఉన్న ఎంపీలు ఉన్నారు. వారు ఆయనకు అర్థం చేయించాలి. మేము నియమాలను పాటిస్తాం, నియమాలకు విరుద్ధంగా ఏం చేయం అని పేర్కొన్నారు. బడ్జెట్ చర్చ సందర్భంగా భారత్–అమెరికా తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని రాహుల్ గాంధీ సంపూర్ణ లొంగుబాటుగా అభివర్ణిస్తూ, దేశ ఇంధన భద్రతను అమెరికాకు అప్పగించారని, రైతుల ప్రయోజనాలు దెబ్బతిన్నాయని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను అబద్ధాలతో నిండినవిగా కొట్టిపారేసిన రిజిజు, సభా రికార్డుల నుంచి తొలగించాలంటూ ట్రెజరీ బెంచీలు కోరనున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీపై ముందస్తు నోటీసు లేకుండా సభలో పేరు ప్రస్తావించడం కూడా తీవ్ర ప్రివిలేజ్ ఉల్లంఘనగా పేర్కొన్నారు.
దుబే లేఖలో ఆరోపణలు
ఇక బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే బుధవారం స్పీకర్‌కు రాసిన లేఖలో, రాహుల్ గాంధీ దేశాన్ని అంతర్గతంగా అస్థిరం చేయాలనే మోసగాళ్ల గ్యాంగ్లో భాగమని ఆరోపించారు. ఆయన నాలుగు తీవ్ర దుర్వ్యవహారాలను ప్రస్తావించారు.
భారత సైన్యం ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం
మాజీ సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే ప్రచురించని పుస్తకాన్ని ఉదహరిస్తూ, రక్షణ మంత్రిత్వ శాఖ, భారత సైన్యాన్ని ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
కార్పొరేట్, బ్యాంకింగ్ రంగంపై వ్యాఖ్యలు
భారత కార్పొరేట్ సంస్థలు, బ్యాంకింగ్ వ్యవస్థపై వక్రీకరించి , పెద్ద బిజినెస్ హౌస్ తో కుమ్మక్కై వ్యవస్థ కుప్పకూలిందన్న భావన కలిగించే ప్రయత్నం చేశారని విమర్శించారు.
విదేశీ సంస్థల ప్రభావం ఆరోపణ
జార్జ్ సోరోస్ ఫౌండేషన్ వంటి విదేశీ సంస్థల ప్రభావంలో ఉన్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు ఫోర్డ్ ఫౌండేషన్ నిధులు సమకూరుస్తుందంటూ ఆరోపించారు. రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు వంటి సంస్థలపై ఆధారరహిత ఆరోపణలు చేసి పార్లమెంట్ గౌరవాన్ని తగ్గించారని దుబే పేర్కొన్నారు.
విచారణకు డిమాండ్
రాహుల్ గాంధీ చర్యలను సమగ్రంగా పరిశీలించేందుకు తక్షణమే ప్రత్యేక పార్లమెంటరీ విచారణ కమిటీ ఏర్పాటు చేసి, అవసరమైతే లోక్‌సభ నుంచి ఆయనను బహిష్కరించే అంశాన్ని కూడా పరిశీలించాలని దుబే స్పీకర్‌ను కోరారు. ఇది మంచు కొండలో కనిపించే భాగం మాత్రమే అంటూ మరింత లోతైన దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై ప్రివిలేజ్ నోటీసు, విచారణ కమిటీ డిమాండ్ నేపథ్యంలో పార్లమెంట్‌లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రివిలేజ్ మోషన్ ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధం
కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ సభ్యులపై వచ్చే ఏదైనా ప్రివిలేజ్ మోషన్‌ను పార్టీ ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉందని. పార్లమెంటులో ఒప్పందాలు, నిబంధనలు పాటిస్తూ, ప్రతిపక్షం సమస్యలను ఎత్తిచూపుతుందని అన్నారు. చివరిసారి రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయడానికి ప్రయత్నించినప్పుడు, ప్రజలు ఆయనకు ప్రధాని మోడీ కంటే ఎక్కువ ఓట్లు ఇచ్చారు. మేం పార్లమెంటులో నిజాన్ని చెప్పడం కొనసాగిస్తామని అన్నారు.
