Let's talk: editor@tmv.in
లోక్‌సభ ఎన్నికల ముందే ‘ఇండియా’ కూటమి చురుగ్గా మారుతుంది: సంజయ్‌రౌత్

లోక్‌సభ ఎన్నికల ముందే ‘ఇండియా’ కూటమి చురుగ్గా మారుతుంది: సంజయ్‌రౌత్

Pinjari Chand
19 ఫిబ్రవరి, 2026

శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ‘ఇండియా’ ప్రతిపక్ష కూటమి పనితీరుపై విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికలు సమీపించినప్పుడు మాత్రమే కూటమి చురుకుగా మారుతుందని, కీలక జాతీయ అంశాలపై నిరంతర సమన్వయం లోపిస్తున్నదని ఆరోపించారు. ముంబైలో బుధవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడితేనే ఇండియా బ్లాక్ పని ప్రారంభమవుతుంది. అంతవరకు ఎవరి మధ్యా సరైన కమ్యూనికేషన్ ఉండదు. కూటమిలో ఎవరు ఏమి చేస్తున్నారు అన్నది కూడా స్పష్టంగా ఉండదని అన్నారు.

సభలో సమస్యలను లేవనెత్తడం మాత్రమే సరిపోదని, ముఖ్యంగా ప్రతిపక్ష నేతలను మాట్లాడనీయని పరిస్థితుల్లో అది ఫలప్రదం కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించిప్రస్తావిస్తూ పార్లమెంట్‌లో రాహుల్ గాంధీని కూడా మాట్లాడనివ్వరు. అలాంటప్పుడు బయట మేమేం చేయగలం? అని ప్రశ్నించారు. దేశంలో రైతుల సమస్యలు, చట్టవ్యవస్థ పరిస్థితులు, మణిపూర్ పరిస్థితి వంటి అనేక కీలక అంశాలు ఉన్నాయని, వీటిపై కూటమి సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని రౌత్ పేర్కొన్నారు. అమెరికాతో కుదిరిన ఒప్పందం వల్ల దేశ రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. రైతుల ఆత్మహత్యలు, ఆకలి సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. కేవలం పార్లమెంట్‌లో గళమెత్తడం వల్ల ప్రయోజనం ఉండదని అన్నారు.

కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య తరచూ సంభాషణ ఉండాలని, కూటమి ఎన్నికల ముందు మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు చురుకుగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఉద్ధవ్ ఠాక్రే గానీ, ఇతర నేతలు గానీ—మేమంతా ఇండియా కూటమి నిరంతరం చురుకుగా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. కూటమి నాయకత్వంపై వస్తున్న చర్చలపై స్పందిస్తూ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేదా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూటమికి నాయకత్వం వహించాలనే సూచనలు వ్యక్తిగత అభిప్రాయాలేనని అన్నారు. ఒకరు మమతా బెనర్జీ నాయకత్వం వహించాలని అంటున్నారు. మరొకరు స్టాలిన్ అని చెబుతున్నారు. ఇవన్నీ వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. అలాంటి అంశాలను చర్చించాలంటే కూటమి అధికారిక సమావేశం నిర్వహించాలని పేర్కొన్నారు. 2026లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారిక షెడ్యూల్‌ను త్వరలో ఈసీఐ ప్రకటించే అవకాశం ఉంది.