
లోక్‌సభలో 8 మంది ఎంపీల సస్పెన్షన్ రద్దు
లోక్‌సభలో సస్పెండ్ చేసిన ఎనిమిది మంది ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్‌ను తక్షణమే రద్దు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా సభలో ప్లకార్డులు, పోస్టర్లు, ఫోటోలు లేదా ఏఐతో రూపొందించిన చిత్రాల ప్రదర్శనకు పూర్తిగా నిషేధం విధించారు. ఫిబ్రవరి 3న ‘అనుచిత ప్రవర్తన’ కారణంగా బడ్జెట్ సమావేశాల కాలం మొత్తం సస్పెండ్ చేసిన ఈ సభ్యులపై నిర్ణయాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ సభ్యుడు కే.సురేశ్‌సభను కోరారు. సభలో జరిగిన పరిణామాలు విచారకరమని, భవిష్యత్తులో సభ సజావుగా నడిచేందుకు తమ పార్టీ సహకరిస్తుందని తెలిపారు. అనంతరం పలువురు ప్రతిపక్ష సభ్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ సభ సజావుగా నడవాలంటే ఒక ‘లక్ష్మణ రేఖ’ అవసరమని పేర్కొన్నారు. దీనికి అధికార, ప్రతిపక్ష సభ్యులు సమ్మతి తెలిపారు. స్పీకర్ బిర్లా మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత పార్లమెంట్‌లో చర్చలు సజావుగా సాగాలని, అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. తర్వాత రిజిజు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వాయిస్ ఓటుతో ఆమోదించి, ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలు, ఒక సీపీఐ(ఎం) సభ్యుడి సస్పెన్షన్‌ను రద్దు చేశారు.
సస్పెండ్ అయిన సభ్యుల్లో గుర్జీత్ సింగ్ ఔజ్లా, హిబి ఈడెన్, సి. కిరణ్ కుమార్ రెడ్డి, అమరిందర్ సింగ్ రాజా వారింగ్, మణిక్కం ఠాగూర్, ప్రశాంత్ పడోలే, డీన్ కురియాకోస్ తో పాటు సీపీఐ(ఎం)కి చెందిన ఎస్. వెంకటేశన్ ఉన్నారు. ఫిబ్రవరి 3న లోక్‌సభలో జరిగిన గందరగోళం నేపథ్యంలో వీరిని బడ్జెట్ సెషన్ ముగిసే వరకు (ఏప్రిల్ 2 వరకు) సస్పెండ్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ధర్మేంద్ర యాదవ్ కూడా ఈ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ సభ గౌరవాన్ని కాపాడుతామని హామీ ఇచ్చారు. అయితే అధికార పక్ష సభ్యులు కూడా సముచితంగా ప్రవర్తించాలని సూచించారు.
దీనికి స్పందించిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే తన 17 ఏళ్ల పార్లమెంటరీ జీవితంలో ఎప్పుడూ సభ గౌరవాన్ని దెబ్బతీయలేదని తెలిపారు. యాదవ్ వ్యాఖ్యలపై క్షమాపణ కోరారు. ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే, అధికార-ప్రతిపక్షాలు పరస్పరం గౌరవం పాటిస్తూ సభను సజావుగా నడిపించాలని సూచించారు. ఎవరూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకూడదు, ఒక లక్ష్మణ రేఖ ఉండాలని ఆమె అన్నారు. జేడీయూ నేత, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కూడా రెండు పక్షాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రిజిజు మాట్లాడుతూ ప్రజలు మనలను సభలో అడ్డంకులు సృష్టించడానికి కాదు, చర్చలు జరిపేందుకు ఎన్నుకున్నారని గుర్తుచేశారు. సభ సజావుగా నడవడం అందరి బాధ్యత అని తెలిపారు. కాంగ్రెస్ సభ్యుడు కే. సురేష్ మాట్లాడుతూ, సోమవారం నుంచి ప్రతిపక్ష సభ్యులు ఎలాంటి ప్లకార్డులు ప్రదర్శించలేదని, భవిష్యత్తులో కూడా సభ సక్రమంగా నడిచేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
